తమ గ్రూప్ పై హిండెన్ బెర్గ్ రీసెర్చ్ రిపోర్టు అంతా అవాస్తవమని అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఈ రిపోర్టు చూసి దిగ్భ్రాంతి చెందామని, ఇది దురుద్దేశంతో కూడినదని, తప్పుడు సమాచారంతో దీన్ని విడుదల చేశారని, ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్న ఈ గ్రూప్.. .. అసలు తమను సంప్రదించడానికి గానీ, నిజాలను వెరిఫై చేసుకోవడానికి గానీ ఆ సంస్థ ఎలాంటి ప్రయత్నం చేయలేదని తప్పు పట్టింది. అర్థరహితమైన ఇలాంటి ఆరోపణలను ఇండియాలోని అత్యున్నత కోర్టులు కూడా కొట్టివేశాయని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగ్షిందర్ సింగ్ తెలిపారు.
ఈ నివేదికను ప్రచురించిన టైమింగ్ ని కూడా చూస్తే ఇది పూర్తిగా మా గ్రూప్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నంగానే కనిపిస్తోందని ఆయన ఓ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ నుంచి రానున్న ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ని దెబ్బ కొట్టడానికి జరిగిన యత్నమే ఇదన్నారు. ఇండియాలో ఇలాంటి ఆఫరింగ్ అతి పెద్దదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రముఖ ఆర్ధిక నిపుణులు, అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు రూపొందించిన నివేదికలు , వివరణాత్మక విశ్లేషణల ఆధారంగా సాగుతున్న మా గ్రూప్ పై ఇన్వెస్టర్లు పూర్తి విశ్వాసాన్ని చూపుతున్నారని ఆయన అన్నారు. ఏకపక్ష నివేదికలు , నిరాధార ప్రచారాలు మా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపబోవన్నారు.
అనేక దశాబ్దాలుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణులు, సీఈఓలతో కూడిన మార్కెట్ లీడింగ్ బిజినెస్ మాది.. జాబ్ క్రియేషన్ వ్యవస్థ మాది.. డైవర్స్ పోర్టుఫోలియోతో ఇండియాలో మేం అగ్రగామిగా ఉన్నాం అని ఈ స్టేట్మెంట్ పేర్కొంది. తాము అన్ని చట్టాలను పాటిస్తామని, కార్పొరేట్ గవర్నెన్స్ లో అత్యున్నత ప్రమాణాలను అనుసరిస్తామని ఇందులో వివరించారు.