అదానీ గ్రూపు నమ్మశక్యం లేనివిధంగా మరో షాకిచ్చింది. ఇప్పటికే 2024 సెప్టెంబరులో చెల్లించాల్సిన 1.11 బిలియన్ డాలర్ల లోన్ ని ఆ గడువుకన్నా ముందుగానే చెల్లిస్తామని ప్రకటించి ఇన్వెస్టర్లలో ఆశలు రేపిన ఈ గ్రూపు తాజాగా మరో భారీ ప్రకటన చేసింది. వచ్చే మార్చి నెలలో తాము విదేశీ బ్యాంకులకు చెల్లించవలసిన 500 మిలియన్ డాలర్ల లోన్ ని ముందే చెల్లించే ప్రతిపాదన ఉందని గురువారం తెలిపింది. అదానీ గ్రూపు సంస్థలు ఫ్రాడ్ కు పాల్పడ్డాయని, స్టాక్ మార్కెట్లను నిండా ముంచాయంటూ అమెరికా లోని హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ ఇటీవల అనేక ఆరోపణలు చేయడంతో పలు బ్యాంకులు ఈ కంపెనీల విషయంలో అనుమానాలను పెంచుకున్నాయి.
వీటికి తాము మళ్ళీ రుణాలు ఇచ్చిన పక్షంలో వాటిని తిరిగి చెల్లించగలుగుతాయా అని సందేహాలను వ్యక్తం చేశాయి. గత ఏడాది హోల్సిమ్ లిమిటెడ్ సిమెంట్ ఆస్తుల కొనుగోలుకు ఫైనాన్స్ చేసేందుకు గాను స్టాండర్డ్ చార్టర్డ్,డ్యూష్ బ్యాంక్ ఏజీ వంటివి 4.5 బిలియన్ డాలర్లను రుణాలుగా ఇచ్చాయి. వీటిలో కొన్నింటిని మార్చి 9 లోగా అదానీ గ్రూపు చెల్లించాల్సి ఉంది.
హిండెన్ బెర్గ్ నివేదిక ప్రచురితం కావడానికి వారం రోజుల ముందు రుణాలకు సంబంధించి రీఫైనాన్స్ చేయడానికి ఈ బ్యాంకులు సంప్రదింపులు జరిపాయి. అయితే ఆ నివేదిక ప్రచురితమైన తరువాత ఆ సంప్రదింపుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అవి నిలిచిపోయాయి. ఏమైనా లోన్ లో కొంతభాగాన్ని ముందుగానే తీర్చే యోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని అదానీ గ్రూపు అధికార ప్రతినిధి ఒకరు బ్లూమ్ బెర్గ్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఇవి ఇంకా కొనసాగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారని సమాచారం. అయితే ఆ బ్యాంకుల నుంచి స్పందన ఇంకా తెలియలేదు. ఈ వారంలో అదానీ గ్రూపు స్టాక్స్ కొంతవరకు కోలుకున్నప్పటికీ మళ్ళీ గురువారం కొన్నింటి షేర్లు తగ్గడంతో తిరిగి అనుమానాల నీలినీడలు పరచుకుంటున్నాయి.