స్టాక్ మార్కెట్ లో ఏర్పడిన ఒడిడుకుల కారణంగా 20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్..ఎఫ్ పీ ఓ ను తాము విరమించుకుంటున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ సొమ్మును ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించింది. మార్కెట్ లో తలెత్తిన హెచ్చు తగ్గుల పరిస్థితి వల్ల ఇక ఈ విషయంలో ముందుకు వెళ్లడం నైతికంగా సరికాదని అదానీ బోర్డు అభిప్రాయపడింది.
పారిశ్రామికవేత్తగా తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణ కాలంలో ముఖ్యంగా ఇన్వెస్టర్ల నుంచి ఎంతో సపోర్ట్ పొందానని, నా జీవితంలో ఏదైనా కొద్దిగానైనా ఏదైనా సాధించానంటే అది వారు నాపై ఉంచిన విశ్వాసమే కారణమని అదానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నా విజయాలకన్నింటికీ వారే కారణమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకన్నా మించింది తనకు మరొకటి లేదని ఆయన అన్నారు.
నష్టాల బారి నుంచి వారిని కాపాడేందుకే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ను విరమించుకుంటున్నామని అదానీ స్పష్టం చేశారు. మూడు రోజుల ఈ బిడ్ వ్యవహారంలో చివరి రోజున ముకేశ్ అంబానీ, సజ్జన్ జిందాల్, సునీల్ మిట్టల్ సహా పలు భారతీయ బిజినెస్ కుటుంబాలు ఇందులో పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది.
బుధవారం అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 26.7 శాతం క్రాష్ అయ్యాయి. నిజానికి గత నెల 31 న ఎఫ్ పీ ఓ సబ్ స్క్రిప్షన్లు పూర్తిగా సఫలమై ఈ వ్యవహారం సంతృప్తిగా క్లోజయింది. కానీ మార్కెట్ లో ఏర్పడిన సంక్షోభం అదానీ గ్రూపు కంపెనీలకు షాకిచ్చింది.