– అదానీపై సెంట్రల్ సైలెంట్.. కారణాలేంటి?
– నేషన్ పై దాడి అంటే.. స్కాంలు స్కీంలు అవుతాయా?
– 413 పేజీల పసలేని కౌంటర్ తో దేశం గుర్తుకొచ్చిందా?
– కార్పొరేట్ స్కాంలు అన్నీ ఇంతేనా?
– ఇండియాలో మేనేజింగ్.. మరి, అమెరికాలో!
– అదానీ మరకలకు బీజేపీ దూరం?
క్రైంబ్యూరో, తొలివెలుగు:కార్పొరేట్ స్కాంలు జరుగుతున్నాయని ఇండియన్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు ఎంత మొత్తుకున్నా.. ఆ క్షణం పట్టించుకోకుండా పట్టం కట్టేస్తుంటారు పాలక వర్గాల పొలిటీషన్స్. కానీ, అవన్నీ బయటపడటంతో నాకేం సంబంధం లేదని తప్పించుకుంటారు. ఇలా దేశంలో ఎన్నో స్కాంలు వెలుగుచూశాయి. సహారా స్కాం నుంచి ఆదర్శ కుంభకోణం దాకా జరిగింది ఇదే. ప్రతీ ప్రభుత్వంలో జరిగే తెరవెనుక వ్యవహారాల్ని ఇండియన్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు వారికున్న వనరులతో ఏదో విధంగా బయట పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్కీముల్లో స్కాంలు, తెరవెనుక టెండర్ల వ్యవహారాలు, పారదర్శకత లేని ప్రాజెక్ట్స్ తో వేల కోట్ల అక్రమార్జన, లిటిగేషన్ ల్యాండ్స్ తో వందల కోట్ల లావాదేవీలు.. ఇలా లక్షల కోట్ల స్కాములు జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా అమాయకపు ప్రజలను వంచించిన కుంభకోణాలు ఎన్నో. ఇలాంటి వాటిని పసిమొగ్గలోనే తుంచివేయడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అదానీ కంపెనీపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది. దీంతో లక్షల కోట్ల సంపద అవిరై పోవడంతో ఎంతోమంది పెట్టుబడిదారులు నష్టాలను చవిచూస్తున్నారు.
413 పేజీలతో కంటెట్ లేని కౌంటర్!
అదానీ సంపాదిస్తే.. దేశ సంపద పెరిగినట్లు ఆ గ్రూప్ కౌంటర్ ఇచ్చింది. దేశంపై దాడి జరిగినట్లు అభివర్ణించింది. అయితే.. ఇదే విషయాన్ని మొదటి దశలోనే ఎందుకు ఖండించలేదు? మోడీ ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా? లక్షల కోట్లు నష్టపోతుంటే మౌనంగా ఉండాల్సిన అవసరం ఇండియాకి లేదు కదా? రీసర్చ్ రిపోర్ట్ అంతా తప్పు అంటున్న అదానీ న్యాయపోరాటాన్ని విస్మరించింది. ఎలాంటి చర్యలకైనా రెడీ అంటూ హిండెన్ బర్గ్ విసిరిన సవాల్ కి ప్రతి సవాల్ లేకపోవడం పేలవంగా అనిపిస్తోంది. తమపై దురుద్దేశం.. దేశంపై దాడి అని తప్పించుకునేందుకు ప్రయత్నించడం విమర్శల పాలవుతోంది. ఇలా గతంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేసింది. అచ్చం ఇలాగే తప్పించుకునేందుకు తప్పుడు తీర్పులు తెచ్చుకుని మసిపూసి మారేడు కాయ చేసింది. అలాగే ఈ అదానీ కంపెనీ కౌంటర్ ఉండటం.. ఇండియాలో నడిచినట్లు అమెరికాలో తెరవెనుక వ్యవహారం నడవకపోవడంతో.. ప్రపంచ కుభేరుల్లో మూడో స్థానం నుంచి పాతళంలోకి పడిపోయారు. ఇదే స్కాంపై నేషన్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు రాస్తే.. దేశ ద్రోహులని ముద్ర వేసి జైల్లో వేసేవారని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొగ్గలోనే తుంచేయాలి!
ఈరోజు అదానీ అక్రమాలు బయటపడ్డట్లు.. రేపు మరో కంపెనీ అవినీతి బయటకు రావొచ్చు. వివిధ పేపర్స్ లో వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ జరిపి మొగ్గలోనే తుంచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేకపోతే.. ఆ కంపెనీ యాజమాన్యం తప్పించుకుని.. వారి షేర్స్ డైవర్ట్ చేసి ప్రజల సంపదను దోచేసే అవకాశాలు లేకపోలేదు.
కార్పొరేట్ సంపద.. దేశ సంపద ఎలా అవుతుంది?
ప్రభుత్వాల వద్ద నుంచి భారీగా లబ్ది పొంది… బాండ్స్ రూపంలో పార్టీలకు ఫండ్స్ చేయడం కామన్. అయితే.. కార్పొరేట్ కంపెనీల సంపద పెరిగితే.. భారత సంపద పెరిగినట్లు కాదని తెలుసుకోవాలి. ఒక్క కంపెనీ బజారున పడితే.. దేశం మొత్తం తప్పు చేసినట్లు కాదు. లాభాల్లో ఎక్కడైనా టాక్స్ చెల్లించాల్సిందే. బిజినెస్ అనేది లాభాలు లేకుండా చేయడం లేదు. లాభాలు వేరు లాలూచీలు వేరని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదానీ గ్రూప్ 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పింది. పెట్టుబడులు అన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయని తెలిపింది. మరో 23 ప్రశ్నలకు 18 పబ్లిక్, థర్డ్ పార్టీ వారు చెప్పాలని తప్పించుకుంది. 5 ప్రశ్నలు నిరాధారమైనవి అని తెలిపింది. అయితే.. ఇవన్నీ తప్పు అయితే లీగల్ లా వెళ్లాల్సి ఉంటుంది. ఆయా చట్టాలకు అనుకూలంగా శిక్షలు పడేలా పని చేయాలి. కానీ, దేశంపై దాడి అని అత్యంత వేగంగా లక్షల కోట్ల సంపద పోగుచేసుకుని అభివృద్ది చెందిన వ్యక్తులు చెప్పడం వితండవాదమే. ఇలా వార్తలు వచ్చిన ప్రతీసారి ప్రతీ కంపెనీ ఇలానే తప్పించుకోవడం పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.