హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ కంపెనీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింప జేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఉభయ సభలను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరిగాలేదన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయని పేర్కొన్నారు. ప్రజానుకూల చట్టాలతో కాంగ్రెస్ కు సంబంధం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న సమస్యలపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పదేపదే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ దీన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. అందుకే ఆ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ వ్యవహారాలపై ఆ పార్టీ కనీసం ఆసక్తి చూపలేదని ఫైర్ అయ్యారు. ప్రజానుకూల చట్టాలను తీసుకురావడం గురించి వారు పట్టించుకోవడం లేదన్నారు. గత తొమ్మిదేళ్లలో పార్లమెంట్ లోని అన్ని సాంప్రదాయాలను కాంగ్రెస్ అగౌరవ పరిచిందని ఆరోపించారు.
ఆ పార్టీ నాయకులు పార్లమెంటుకు హాజరు కాకుండా విదేశాల్లో సెలవులను ఇష్టపడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం చూస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రపతిని అవమానించినట్లే అని అన్నారు. అభివృద్ధి ఆధారిత బడ్జెట్‌కు ప్రశంసలు అందించాల్సి వస్తుందనే భయంతో పార్లమెంటును నడిపించేందుకు ఆ పార్టీ దూరంగా ఉంటోందన్నారు.