బీజేపీపై శివసేన(ఉద్దవ్ బాలా సాహెబ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున ‘గోవు హగ్ డే’గా జరుపుకోవాలంటూ జంతు సంక్షేమ బోర్డు నోటీసులు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు.
బీజేపీకి వ్యాపారవేత్త అదానీ పవిత్రమైన ఆవు అని ఆయన అన్నారు. అందుకే, బీజేపీ తమ పవిత్రమైన ఆవును కౌగిలించుకుందన్నారు. ప్రేమికుల రోజున తాము హగ్ చేసుకునేందుకు మాత్రం ఇతర ఆవులను తమకు వదిలేశారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆవును తాము గోమాతగా గౌరవిస్తామని పేర్కొన్నారు. గోవుపై తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రత్యేకమైన రోజు అవసరం లేదన్నారు. ఇది ఇలా వుంటే అదానీ కంపెనీ వ్యవహారంపై పార్లమెంట్ లో ఈ రోజు కూడా రచ్చ జరిగింది. అదానీ వ్యవహారంపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, ఆప్ లు డిమాండ్ చేశాయి.
ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో రెండు పార్టీలు నిరసనకు దిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో పాటు ప్రధాని మోడీ కూడా పార్లమెట్ లో అదానీకి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ మేరకు వ్యాఖ్యాలు చేశారు.