అదానీ గ్రూపు వ్యవహారంపై విపక్షాలు సోమవారం కూడా పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేశాయి. దేశ ఆర్థిక రంగానికి సవాలుగా పరిణమించిన అదానీ వివాదంపై వెంటనే చర్చ చేబట్టాలని ప్రతిపక్ష సభ్యులు లోక్ సభ, రాజ్యసభలో పట్టు బట్టారు. అయితే ఇందుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ కర్ నిరాకరించడంతో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ‘అదానీ సర్కార్’ అని వారు నినాదాలు చేస్తూ అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ చేతగానీ, సుప్రీంకోర్టు చేతగానీ విచారణ జరిపించాలన్న తమ డిమాండును పునరుద్ఘాటించారు.
వీరి రభస కారణంగా ఉభయ సభలూ మొదట మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి. ఆ తరువాత కూడా పార్లమెంటులో ఇదే పరిస్థితి కనిపించింది. లోక్ సభ, రాజ్యసభలో సభా కార్యకలాపాలను ప్రతిపక్షాలు స్తంభింపజేశాయి. అదానీ సమస్యపై చర్చ జరగకుండా మరే ఇతర కార్యక్రమాన్నీ చేపట్టనివ్వబోమని విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకుపోయారు.
బీజేపీ ఎంపీలకు, వీరికి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు , వాగ్యుధ్ధాలతో సభలు వేడెక్కాయి. స్పీకర్ ఓం బిర్లా, చైర్మన్ జగదీప్ ధన్ కర్ చేసిన హెచ్చరికలను విపక్షాలు ఖాతరు చేయకపోవడంతో వారు సభలను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
ఆ తరువాత పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద విపక్ష సభ్యులు నిరసనకు కూచున్నారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ నోరు విప్పాలని, ఎల్ఐసీ, ఎస్బీఐ వంటివాటిని రక్షించాలని వారు నినాదాలు చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ‘అదానీ సర్కార్ డౌన్ డౌన్’ అంటూ స్లొగన్స్ ఇచ్చారు. మొత్తం 16 విపక్షాలకు చెందిన నేతలు సోమవారం ఉదయమే కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్ లో సమావేశమై.. అదానీ వివాదం మీద పార్లమెంటును స్తంభింపజేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ తో బాటు డీఎంకే, బీఆర్ఎస్, ఎన్సీపీ, జేడీ-యు, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), ఝార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ లోక్ దళ్, ఆప్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్జేడీ, శివసేన, ఆర్ ఎస్పీ పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.