కేరళలో అదానీ పోర్టు ప్రాజెక్టుకు నిరసన సెగలు తగులుతున్నాయి. విజిన్ జిమ్ పోర్టు నిర్మాణం వల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందంటూ పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఆందోళనలకు దిగారు. వీరికి కేథలిక్ మతగురువులు కూడా మద్దతు పలుకుతుండడంతో నిరసనలు మరింత పేట్రేగాయి.
పోర్టు అభివృద్ధి వల్ల సముద్ర తీరం కోతకు గురవుతుందని, తాము జీవనోపాధిని కోల్పోతామని మత్స్యకారులు ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. ఈ పోర్టు పనులను అదానీ గ్రూపు సుమారు మూడు నెలలుగా ఆపివేసినప్పటికీ మళ్ళీ ఇటీవల కాలంలో ప్రాజెక్టు ప్రాంతానికి వాహనాలు ఇసుక, ఇతర అవసరాలను చేరవేయడం ప్రారంభమైంది.
దీంతో ఆందోళనకారులు వీటిని అడ్డుకోవడం ప్రారంభించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో వారిని విడుదల చేయాలంటూ వేలాది మత్స్య కారులు పోలీసులపై రాళ్ళు విసిరారు. వీరికి కొందరు బిషప్ లు కూడా తోడయ్యారు.
ఈ దాడుల్లోకొన్ని పోలీసు వాహనాలు దెబ్బ తిన్నాయి. ఈ ఆందోళనల్లో పోలీసులు సహా 80 మందికి పైగా గాయపడ్డారు. ఒక దశలో పోలీసు స్టేషన్ ని కూడా నిరసనకారులు ముట్టడించారు. 900 మిలియన్ డాలర్ల విజిన్ జిమ్ పోర్టు ప్రాజెక్టు మొత్తానికి చిక్కుల్లో చిక్కుకుంది. ఈ ప్రాంతం వద్ద 600 మందికి పైగా పోలీసు అధికారులను మోహరించినట్టు తెలుస్తోంది. తాము ఈ తీర ప్రాంతానికి ఎలాంటి నష్టం కలిగించబోమని, మత్స్య కారుల జీవనోపాధికి భంగం వాటిల్లబోదని అదానీ గ్రూపు అధికారులు చెబుతున్నారు.