ఒకనాడు దేశాన్ని కుదిపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ కేసుతోనూ అదానీ గ్రూప్ కి లింక్ ఉందంటూ హిండెన్ బెర్గ్ రీసెర్చ్ రిపోర్టు పేర్కొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగపూర్ లోని ఓ కంపెనీకి, ఈ గ్రూప్ లోని ఓ సంస్థకు సంబంధం ఉందని ఈడీ 2018 లోనే దాఖలు చేసిన తన తొలి ఛార్జ్ షీట్ లోను, రెండో అనుబంధ చార్జ్ షీట్ లోను పేర్కొందట. అయితే దీనిపై సింగపూర్ లోని సదరు సంస్థకు చెందిన అధికారులు లెటర్ రొగేటరీని .. సమాధాన పత్రాన్ని పంపిన తరువాత అదే ఏడాది ఈడీ తన మూడో అనుబంధ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయకుండా ఉపసంహరించుకుంది.
సింగపూర్ లోని గుడామీ ఇంటర్నేషనల్ ప్రైవెట్ లిమిటెడ్ అనే కంపెనీ.. అదానీ ఎక్స్ పోర్ట్స్ తో లావాదేవీలు జరిపింది. ఈ అదానీ ఎక్స్ పోర్ట్స్ నే ఆ తరువాత అదానీ ఎంటర్ ప్రైజెస్ గా మార్చారు. 2002 లో బీఎస్ఈ లో ఈ సంస్థ లిస్ట్ అయి ఉంది. అదానీ గ్లోబల్ తోనూ ఇది కీ కామన్ షేర్ హోల్డర్ గా వ్యవహరించిందని హిండెన్ బెర్గ్ రిపోర్టు తెలిపింది. అయితే ఈడీ ఛార్జ్ షీట్లలో గూడామీ సంస్థను ‘గూడానీ’ గా తప్పుడుగా పేర్కొన్నారని, 2017 నవంబరులో ఈడీ మూడో అనుబంధ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడానికి ముందే గూడామీ కంపెనీ తన లెటర్ రోగేటరీని పంపిన అనంతరం ఆ ఛార్జ్ షీట్ ని ఈడీ ఉపసంహరించుకోగా.. ఆ సంస్థ (గుడామీ) తన లావాదేవీలకు స్వస్తి చెప్పి పూర్తిగా ఇనాక్టివ్ అయిందని హిండెన్ బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఆ తరువాత సింగపూర్ రిజిస్ట్రీ నుంచే ఈ సంస్థ తప్పుకుందట.
2014 లో అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తుండగా తన మొదటి ఛార్జ్ షీట్ లో ఈ సంస్థ గుడామీ కంపెనీ పేరును ప్రస్తావించింది. కన్సల్టెన్సీ సర్వీసులకు ఫేక్ ఇన్ వాయిస్ లను ఇవ్వడం ద్వారా నాడు ప్రధాన నిందితుడైన గౌతమ్ ఖైతాన్ కి ఈ సంస్థ ప్రయోజనం కల్పించింది. ఇక 2017 లో ఈడీ రూపొందించిన రెండో అనుబంధ ఛార్జ్ షీట్ లోనూ గుడామీ ఇంటర్నేషనల్ పేరును ప్రస్తావించింది.
ఆ సందర్భంలో మధ్యదళారీ రాజీవ్ సక్సేనా పై కూడా అభియోగం మోపింది. 2009 లో ఖైతాన్ సంస్థలఫై దాడి సందర్భంగా ఓ ఉద్యోగి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా గూడామీతో బాటు అనేక డొల్ల కంపెనీల నుంచి పలు సంస్థలు నిధులను అందుకున్నాయని తేలింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ 24 కోట్లకు పైగా యూరోలను ట్యునీషియా లోని ఓ సంస్థకు మళ్లించిందని, ఇందులోనుంచి ఈ సంస్థ మారిషస్ లో ఖైతాన్ నేతృత్వం లోని ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీకి 12.4 మిలియన్ యూరోలను బదిలీ చేసిందని వెల్లడైంది.
ఇక వజ్రాలకు సంబంధించి కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిన కేసులో అదానీ గ్రూపుతో గుడానీ సంస్థ జరిపిన లావాదేవాలపై 2005 లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు. గూడామీ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన చాంగ్-చుంగ్ లింగ్ అనే వ్యక్తి ఆదానీకి సంబంధించిన ఇతర సంస్థలలోనూ డైరెక్టర్ గా వ్యవహరించాడట. అదానీ గ్లోబల్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన వినోద్ శాంతీలాల్ షా, చాంగ్-చుంగ్ లింగ్. .ఇద్దరూ సింగపూర్ లో ఒకే చిరునామా గల ఇంట్లో గడిపినట్టు హిండెన్ బెర్గ్ నివేదిక వివరించింది.