గౌతమ్ అదానీ ‘సెగ’ పార్లమెంటును తాకింది. అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఇందుకు లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ కర్ నిరాకరించడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. తక్షణమే హిండెన్ బెర్గ్ రిపోర్టుపై చర్చ చేబట్టాలని, అదానీ అవినీతిపై ఈ సభ చర్చించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై తామిచ్చిన వాయిదాల తీర్మానాల గురించి బీఆర్ఎస్, టీఎంసీ, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష నేతలు ప్రస్తావించారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే రాజ్య సభలో.. , లోక్ సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మాన నోటీసులిచ్చారు. అదానీ వ్యవహారంపై తక్షణమే సభలు చర్చించాలని వారు డిమాండ్ చేశారు. రూల్ 267 కింద జీరో అవర్ ను, ఇతర సభా కార్యకలాపాలను సస్పెండ్ చేసి ..ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల భవితవ్యం, పెట్టుబడుల అంశంపై చర్చ ప్రారంభించాలని వీరు కోరారు.
కోట్లాది భారతీయులు శ్రమకోర్చి ఆర్జిస్తున్న ఆదాయం దీనితో ముడిపడి ఉందన్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన, బడ్జెట్ పైన చర్చ జరగాల్సి ఉందని లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ కర్ .. స్పష్టం చేస్తూ విపక్షాల డిమాండును తిరస్కరించారు.
దీంతో ఉభయసభల్లో విపక్ష సభ్యులు పోడియాల్లోకి దూసుకు పోయి నినాదాలు చేయడంతో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా పోయింది. ఫలితంగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.