దేశంలో సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్ బెర్గ్ వివాదంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యాన ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. మాజీ జడ్జీలు జస్టిస్ ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవ్ దత్ తో బాటు కార్పొరేట్ దిగ్గజాలు నందన్ నీలేకని, కేవీ కామ్ నాథ్, సోమశేఖరన్ సుందరేశన్ లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
ఈ కమిటీ రెండు నెలలోగా తన నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని కోర్టు సూచించింది. ఈ కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరిన కోర్టు… సెబీకి కూడా కొన్ని సూచనలు చేసింది. , సెబీ రూల్స్ లో ఉన్న 19 వ సెక్షన్ ఉల్లంఘన జరిగిందా, షేర్ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారా వంటివాటిపై దృష్టి పెట్టాలని ధర్మాసనం పేర్కొంది. తాము సూచించిన కమిటీకి అన్ని విధాలుగా సహకరించాలని కేంద్రానికి, ఆర్ధిక సంస్థలకు, సెబీ చైర్ పర్సన్ కి సలహా ఇచ్చింది.
ఈ అంశంలో విచారణ పారదర్శకంగా జరిగేందుకు కమిటీని తామే నియమిస్తామని సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ లోగడే స్పష్టం చేశారు. అదానీ-హిండెన్ బెర్గ్ అంశంపై సెబీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, కానీ ఇందులోని మరిన్ని అంశాలపై లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఆయన గురువారం వ్యాఖ్యానించారు.
స్టాక్ ప్రైసింగ్ లో అవకతవకలు జరిగిఉంటే సెబీ దాన్ని కూడా స్పష్టం చేయాలన్నారు. 1957 నాటి సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్స్ రూల్స్ ను ఉల్లంఘించారా అన్నది తేలవలసి ఉందన్నారు. సెబీ తన తదనంతర చర్యల నివేదికను కూడా సమర్పించవలసి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.