అదానీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. అదానీ గ్రూప్-హిండెన్ బెర్గ్ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేయదలచిన కమిటీలో కేంద్రం నియమించిన నిపుణుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్ ని అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. నిపుణులను తామే ఎంపిక చేస్తామని, ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకతతో కొనసాగేలా చూస్తామని సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ నేతృత్వాన గల బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వం సూచించిన వారి పేర్లను తాము పరిగణనలోకి తీసుకున్న పక్షంలో అది ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కమిటీతో సమానమమవుతుందని, అందువల్ల తామే నిపుణుల కమిటీని సెలెక్ట్ చేస్తామని పేర్కొంది.
కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దానిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అదానీ-హిండెన్ బెర్గ్ సమస్యను సమగ్రంగా విచారించేందుకు సిటింగ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యాన కమిటీని తాము నియమించబోమని, రిటైరైన జడ్జి నేతృత్వాన ఇది ఏర్పాటవుతుందని కూడా బెంచ్ క్లారిటీ ఇచ్చింది.
అదానీ క్రైసిస్ కారణంగా స్టాక్ మార్కెట్ లో తీవ్రమైన ఒడిడుకులు ఏర్పడిన నేపథ్యంలో దీనిపై విచారించేందుకు మాజీ న్యాయమూర్తి నేతృత్వాన కమిటీ ని ఏర్పాటు చేయాలని ఈ నెల 10 న సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ సూచనను పురస్కరించుకుని కేంద్రం ఇందుకు కసరత్తు ప్రారంభించింది. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు 13 న కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే వారి పేర్లతో కూడిన సీల్డ్ కవర్ ను ప్రభుత్వం సమర్పిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నాడు కోర్టుకు తెలిపారు.
ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడవలసి ఉందన్నారు. అదానీ వివాద పరిష్కారంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తన పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్.. హిండెన్ బెర్గ్ నివేదికను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్ బృందాన్ని నియమించాలని అభ్యర్థించారు. మరోవైపు.. కమిటీ ఏర్పాటుపై తన ఉత్తర్వులను కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇక ఈ అంశంలో (అదానీ) రెగ్యులేటర్స్ విఫలమైనట్టు తాము భావించడం లేదని బెంచ్ అభిప్రాయపడింది.
.