దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అభిప్రాయాలు వెల్లడించాలని కేంద్రం, సెబీలను కేంద్రం ఆదేశించింది. దీనిపై ఈ నెల 13లోగా స్పందించాలని సెబీని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది.
స్టాక్ మార్కెట్లో దేశీయ మదుపర్ల పెట్టుబడుల పరిరక్షణకు పటిష్టమైన వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలపాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై నిపుణులు, ఇతరులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని త్రిసభ్య ధర్మాసం సూచించింది. పెట్టుబడిదారులను రక్షించేందుకు పటిష్ఠమైన పద్ధతులను అవలంబించాలని ధర్మాసనం నిర్దేశించింది.
సెబీ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర చట్టబద్ధమైన సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని న్యాయవాది విశాల్ తివారీ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహాలో న్యాయవాది ఎంఎల్ శర్మ మరో పిల్ వేశారు.