శుక్రవారం దళాల్ స్ట్రీట్ ఎర్ర బారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ నివేదిక ఇచ్చిన షాక్ తో ప్రధానంగా అదానీ గ్రూప్ నష్టాలను మూటగట్టుకుంది. ఈ గ్రూపు షేర్లు భారీగా పతనం కావడంతో ఆసియాలోనే కుబేరుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ అదానీ ఆస్తుల విలువ గణనీయంగా తగ్గిపోయింది. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ ఇండెక్స్ ప్రకరాం అదానీ సంపద 18 బిలియన్ డాలర్లు తగ్గి 100 బిలియన్ డాలర్లు చేరింది. ఫలితంగా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలోమూడో స్థానం నుంచి ఏడో స్థానానికి దిగజారారు.
శుక్రవారం ఆయన ఆధీనంలోని కంపెనీల షేర్లు దాదాపు రూ. 3.4 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. బీ ఎస్ ఈ ఇండెక్స్ లో అదానీ టోటల్ గ్యాస్ 19.65 శాతం, అదానీ ట్రాన్స్ మిషన్ 19 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 15.50 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 6.19 శాతం పడిపోయాయి. ఇంకా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 5.31 శాతం, అదానీ విల్మార్ 5 శాతం, అదానీ పవర్ 4.99 శాతం దిగజారాయి.
ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్, ఆయిల్, ఐటీ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ కారణంగా మధ్యాహ్న సెషన్ లో 30 షేర్ బీ ఎస్ ఈ బెంచ్ మార్క్ 1,106 పాయింట్లకు అంటే 1.84 శాతం మేర 59,098. 37 వద్ద ట్రేడయింది. బుధవారం నుంచి ఇప్పటివరకు పోల్చుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ లో అదానీ గ్రూప్ సంస్థలు 48 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవి చూశాయి.
అయితే ఈ నెల 31 వరకు షేర్ సేల్ ధరల విషయంలో వెయిట్ అండ్ సీ అన్నట్టు చూస్తామని ఈ సంస్థలకు చెందిన వర్గాలు తెలిపాయి. ఇక శుక్రవారం 20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఓపెన్ కాక ముందే అదానీ ఎంటర్ ప్రైజెస్ ఢమాల్ మంది. జనవరి 31 న ఇష్యును క్లోజ్ చేస్తామని అదానీ గ్రూప్ తెలిపింది.