పది రోజుల క్రితం వరకు గౌతమ్ అదానీ ఓ అజేయ శక్తి. పోర్టుల నుంచి శక్తి రంగం వరకు అన్ని రంగాల్లో ఆయనకు ఎదురు లేదు. అలాంటి వ్యక్తిని హిడెన్ బర్గ్ నివేదిక కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఆయన షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మరో వైపు ఆయన సంపద కరిగిపోతోంది. ఈ ప్రభావం ఒక్క అదానీ మీద మాత్రమే పడటం లేదు. ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఉన్న భారత్ విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని హిడెన్ బర్గ్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి అదానీ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 108 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. హిడెన్ బర్గ్ నివేదికను అదానీ ఖండించారు. కానీ ఆయన స్పందన పెట్టుబడిదారులకు భరోసా కల్పించలేకపోయింది. దీంతో బిలీయనీర్స్ జాబితాలో రెండవ స్థానం నుంచి 21వ స్థానానికి పడిపోయారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం…
ఆస్తుల విలుల అలాగే పడిపోతూ ఉండే అది అదానీ సామ్రాజ్యంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ విశ్వాసం మరింత సన్నిగిల్లితే అది కీలక సమయంలో భారత వృద్ధికి ఎదురుదెబ్బ అవుతుందని అంటున్నారు.
అణిచివేత, కరోనా సంక్షోభం లాంటి అంశాల నేపథ్యంలో పలు బ్యాంకులు, ప్రముఖ మల్టినేషనల్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు సంకోచిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ వైపే అన్ని కంపెనీలు చూస్తున్నాయి. చైనా కన్నా భారత్ లో పెట్టుబడులు పెట్టడం సురక్షితం, లాభదాయకం అని భావిస్తున్నాయి. అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు భారత్ విశ్వసనీయతపై ప్రశ్నలు రేకెత్తిస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
జరిగిపోయిన నష్టం….
హిడెన్ బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. హిడెన్ బర్గ్ నివేదిక బోగస్ అని పేర్కొంది. హిండెన్ బర్గ్ ఓ తప్పుడు నివేదికను ప్రజల్లోకి తీసుకు వెళ్లిందనివెల్లడించింది. ఇది కేవలం అదానీపై జరిగిన దాడి కాదని మొత్తం భారతీయ ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది.
కానీ ఆయన ప్రకటన షేర్ హోల్డర్లలో విశ్వాసం కల్పించలేకపోయింది. కంపెనీ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రభావం కేవలం అదానీ గ్రూపు షేర్లపై మాత్రమే కాకుండా ఆ కంపెనీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులపై కూడా ప్రభావం చూపాయి.
ఇతర సంస్థలపై ప్రభావం…
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 11శాతం పతనమయ్యాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు జనవరి 27 నుండి 31 వరకు భారతదేశ స్టాక్ మార్కెట్ నుంచి నికరంగా 2 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఇది మార్చి నుంచి చూస్తే వరుస మూడు రోజుల్లో అతి పెద్ద విక్రయం.
అదానీకి-సంబంధించి విషయం అధిక స్థాయిలో ప్రతికూల దృష్టిని కలిగిస్తోందని జ్యూరిచ్ ఆధారిత జీఏఎమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫండ్ మేనేజర్ జియాన్ కోర్టేషి అన్నారు. ఇది భారతీయ స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తిని తగ్గిస్తుందని వెల్లడించారు. అదానీ సామ్రాజ్య పతనం ఇతర కార్పొరేట్ సంక్షోభాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను కదిలించే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.