తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసే అవకాశం కోసం ఇటీవల ఏకంగా పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చి సంచలనం రేపి, చర్చనీయాంశమైన తెలంగాణ యువసేన పార్టీ అధినేత అడపా సురేందర్.. తాజాగా మరోసారి పతాక శీర్షికలకెక్కారు. గతంలో ఇచ్చిన ప్రకటనపై ఎలాంటి సమాధానం రాకపోవడంతో మళ్లీ పేపర్ ప్రకటన ఇచ్చారు. ముఖ్యమంత్రి మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చారా? మీ అభ్యర్థనని మన్నించారా? అని తనను చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారని ప్రకటనలో చెప్పుకొచ్చిన సురేందర్.. తాను చేసిన విజ్ఞప్తికి ఇంకా ఎలాంటి ప్రతిస్పందన రాలేదని అందులో గుర్తు చేశారు. ఒకవేళ సీఎంవో అధికారులు.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదేమోనని.. అందుకే తన అపాయింట్‌మెంట్ విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు.
అడపా సురేందర్ ఇచ్చిన ప్రకటనలుతెలంగాణ ప్రజాప్రయోజనాలకు సంబంధించి తాను అత్యవసరంగా ఓ ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని, అందుకు తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కేసీఆర్‌ని కోరుతూ గత నెల 24న ఓ దిన పత్రికలో మొదటిసారి ప్రకటన ఇచ్చారు సురేందర్. అయితే ఒక ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కోసం గతంలో ఎవరూ చేయని విధంగా అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రికి ఆయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నారన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఏదో సంచలనం కావడం కోసం ఇలా ప్రకటన ఇచ్చారేమో అని భావించినవారు కూడా ఉన్నారు. అయితే అనూహ్యంగా దానికి కొనసాగింపుగా మరోసారి అడపా సురేందర్ ఇప్పుడు మళ్లీ పత్రికాముఖ ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌కు సురేందర్ ఏం చెప్పాలనుకుంటున్నారన్నది సస్పెన్స్ అనుకుంటోంటే.. ప్రకటన ముగింపులో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జనరంజక పాలన అందించాలని నొక్కి చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఎవరీ అడపా సురేందర్?
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అడపా సురేందర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత 2005లో తెలంగాణ యువసేన పార్టీని స్థాపించారు. 2006లో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మొదటి నుంచి మీడియా ప్రచారానికి, పబ్లిసిటీకి దూరంగా ఉండే అడపా సురేందర్.. ఇప్పుడు కేసీఆర్‌ను కలవడం కోసం ఏకంగా పత్రికా ప్రకటన ఇవ్వడం విశేషం.