సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకర్గం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుంపటి మొదలైంది. పార్టీ నుండి బహిష్కరించబడిన వడ్డెపల్లి రవిని పార్టీలోకి తీసుకోవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆయనే కారణమని వివరించారు దయాకర్.
పార్టీ టికెట్ తనకు కేటాయించడంతో ఓర్వలేక కాంగ్రెస్ కు రెబల్ అభ్యర్ధిగా పోటీ చేశారని తెలిపారు. ఆ ఎన్నికల్లో రవికి 2700 ఓట్లు పోలయ్యాయని.. తాను మాత్రం 1800 ఓట్ల తేడాతో ఓడిపోయానని.. రవి పోటీలో లేకపోయి ఉంటే తానే గెలిచేవాన్నని పేర్కొన్నారు దయాకర్. కావాలనే తన ఓటమికి రవి కారణం అయ్యారని ఆరోపించారు.
టీఆర్ఎస్ కు అమ్ముడు పోయి తనకు వ్యతిరేకంగా పోటీ చేయడంతో.. అతన్ని పార్టీ అధిష్టానం ఆరేళ్లపాటు బహిష్కరించిందని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల్లో పోటీ చేయడం కారణంగా ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు దయాకర్.
కాంగ్రెస్ పార్టీకి, పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైన రవిని పార్టీలో చేర్చుకోవడాన్ని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వడ్డెపల్లి రవిని పార్టీలో చేర్చుకోవద్దని కోరుతూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కు లేఖ రాశారు అద్దంకి దయాకర్.