కాంగ్రెస్ కార్యకర్తలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నియోజకవర్గ పరిదిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. లేదంటే కేసులు పెడతామని కార్యకర్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారని విరుచుకుపడ్డారు.
పటేల్ పట్వారీ మా దిక్కుంటే.. ఎట్టెట్ట కొడతవో కొట్టరా మొగుడా అన్నట్టు.. ఎదురించే వాడు లేకపోతే.. ఎంతటి ఘోరానికి అయినా తెగిస్తాం అన్నట్టు కిశోర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి పేద వాళ్లపై కేసులు పెట్టించడం న్యాయమేనా అని కిశోర్ ను ప్రశ్నించారు. నియోజకవర్గం పరిదిలోని మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధి లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.
తుంగతుర్తిని దోచుకోవడానికే వచ్చావా..? ఆగం చేయడానికి వచ్చావా..? కిశోర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ ది తుంగతుర్తి లోకల్ అయితే ఇక్కడి ప్రజలపై దాడులు జరిగేవి కాదన్నారు. ఎమ్మెల్యే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. వాటిని అడ్డుకునేందుకు పెద్దగా తిరుగుబాటు చేయాల్సిన అవసరంలేదని.. ఇక్కడి ప్రజల ఆవేశం చాలన్నారు దయాకర్.
Advertisements
తుంగతుర్తి ఎస్ఐ, సీఐ లు ప్రభుత్వానికి కొమ్ముకాయొద్దన్నారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. మీరు తీసుకునే జీతాలు ప్రజలిస్తున్నవే అనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు దయాకర్. వరంగల్ రైతు డిక్లరేషన్ ను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో కలిసి రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని వ్యాఖ్యానించారు అద్దంకి దయాకర్.