ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం అమెరికా మరో మారు సైనిక సహాయాన్ని ప్రకటించింది. ఆయుధాలు, 400 మిలియన్ డాలర్ల మందుగుండు సామాగ్రి, యుద్ద విమానాలు, ఆయుధాలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఆంటోని బ్లింకన్ ప్రకటన చేశారు.
ఈ ప్యాకేజీలో ఉక్రెయిన్‌కు హెచ్ఐఎంఆర్ఎస్ వాహనాలు, హోవిట్జర్‌లు, బ్రాడ్లీ యుద్ద వాహనాలు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు ఆర్మర్డ్ వెహికల్ లాంచ్డ్ బ్రిడ్జ్‌లు, కూల్చివేతకు ఉపయోగించి మందు గుండు సామాగ్రి కూడా ఉన్నట్టు చెప్పారు.
ఉక్రెయిన్‌కు సహాయం చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను తాము కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. తమ మిత్ర దేశాలు, భాగస్వాములు ఈ విషయంలో గొప్ప సహాయాన్ని చేశాయని తెలిపారు. ఉక్రెయిన్ తన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యుద్దాన్ని రష్యా ఒక్కటే ముగించగలదన్నారు. రష్యా అలా యుద్దం ముగించే వరకు ఉక్రెయిన్ సైన్యాన్ని తాము బలపరుస్తామన్నారు. దానికి ఎంత సమయం పట్టినా అప్పటి వరకు తాము ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడతామని ఆయన తేల్చి చెప్పారు.