తెలుగు తమిళ సినిమాల్లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆది పినిశెట్టి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్ నిక్కీ గల్రానీని గత కొంత కాలంగా ప్రేమించి ఇటీవల నిశితార్థం చేసుకున్నారు. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ నిశితార్థం జరిగింది. అయితే, బుధవారం రాత్రి ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నైలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు బంధువులు, సన్నిహితులతో పాటు న్యాచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్, ఆర్య, సయేషా సైగల్ తదితర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.
2015లో వచ్చిన ‘మలుపు’ సినిమాలో వీరిద్దరూ కలిసి మొదటి సారిగా నటించారు. అప్పుడే మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా ‘మరకతమణి’ సినిమా టైమ్ లో ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ళు వీరిద్దరు ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారు. ఈ క్రమంలో అందరిని షాక్‌కు గురిచేస్తూ మార్చి 24న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి.. ‘ఒక విచిత్రం’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించారు. ఇటీవల ఆది ప్రధాన పాత్రలో నటించిన ‘క్లాప్’ నేరుగా సోని లివ్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది.