తెలంగాణలో వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లన్నీ తెరుచుకున్నాయి. కరోనా పుణ్యమా అని దాదాపు రెండు సంవత్సరాల తరువాత పాఠశాల తలుపులు తీశారు. కొంతమంది పిల్లలు ఉత్సాహంగా బడికి వస్తే.. మరికొంత మంది మాత్రం మారాం చేస్తూ తరగతి గదికి వెళ్లారు. తన కుమారుణ్ని బడిలో దిగబెట్టడానికి వచ్చిన కలెక్టర్ కే బుజ్జగింపులు తప్పలేదు. ఇంతకీ ఎవరు ఆ కలెక్టర్ అనుకుంటున్నారా?
కరోనా వ్యాప్తి మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నప్పటికీ.. తగినన్ని జాగ్రత్తలు తీసుకునే పాఠశాలలు నడుపుతామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి తమ పిల్లలను పాఠశాలలకు పంపారు. చాలా రోజుల తరువాత పాఠశాలల ఆవరణలు అన్నీ పిల్లలతో కళకళలాడాయి. ప్రార్థనా గీతాలు వినిపించాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కొందరు పిల్లలు ఉదయాన్నే పాఠశాలలకు వచ్చారు. వారిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమారుడు సారంగ్ కూడా ఉన్నాడు. కుమారుణ్ని స్కూల్లో దించడానికి స్వయంగా ఆమె పాఠశాలకు వచ్చారు. కానీ.. ఆ బుడ్డోడు మాత్రం తరగతి గదిలోనికి వెళ్లనని మారాం చేశాడు. కాసేపు ఏడ్చాడు.
కుమారుడిని బుజ్జగించడానికి కలెక్టర్ కి చాలా సమయమే పట్టింది. తరువాత ఎప్పటికో క్లాస్ లోకి వెళ్లాడు పిల్లాడు. ఇదంతా అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు జిల్లాకు కలెక్టర్ అయినా కొడుకుకు అమ్మే కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.