విజయవాడ : తెలుగుదేశం పార్టీ వలసలకు ‘ఆది’.. అంతం ఏదీ లేకుండా పోయింది. వరుసపెట్టి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి యామినీశర్మ వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను కలిసి కమలదళంలో తన చేరికను కన్ఫమ్ చేసుకుని.. కొసమెరుపుగా ఆయనతో ఒక గ్రూప్ ఫోటో కూడా తీయించుకుని వీకెండ్ రోజు వైరల్ చేసింది. ఇప్పుడు ఈ జాబితాలో మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి కనిపిస్తున్నారు. త్వరలో ‘ఆది’ బీజేపీలో చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు తాను ఆసక్తిగా వున్న విషయాన్నిఆయనతో మాట్లాడినట్టు సమాచారం. కొంతకాలంగా టీడీపీతో ఆదినారాయణరెడ్డి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన రాలేదు. మొన్నామధ్య బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో ఆదినారాయణరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రమేశ్ ద్వారానే అసలు ఆది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా రమేశ్ ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. మూడు పర్యాయాలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డి.. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. అందుకు బహుమానంగా మంత్రి పదవి కూడా పొందారు. అప్పటినుంచి జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆది టీడీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించిన ఆదికి చంద్రబాబు అవకాశం ఇవ్వకపోగా.. తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆదినారాయణరెడ్డి అయిష్టంగానే ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా పోయిన ఆదినారాయణరెడ్డి.. ఇప్పుడు బీజేపీ చేరేందుకు నిర్ణయించుకుని ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదిని చేర్చుకునే విషయంపై బీజేపీ అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తోందన్న ప్రచారం కూడా ఉంది. అందువల్లే కాషాయ కండువ కప్పుకోవడానికి ఆలస్యం జరుగుతోందనే వాదన వినబడుతోంది.