ఆదిపురుష్ టీజర్ ఇలా రిలీజైందో లేదో అలా విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా రావణాసురుడి గెటప్, అతడు ఎక్కిన వాహనంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. మరోవైపు హనుమంతుడికి లెదర్ ను పోలిన దుస్తులు వేయించడంపై కూడా అభ్యంతరాలు తలెత్తాయి. వీటిలో రావణుడి పాత్ర లుక్, అతడి వాహనంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఓం రౌత్.
“టీజర్ లో రావణుడు ఓ రాక్షస పక్షిపై వస్తున్నట్టు విజువల్ ఉంది. అయితే అది పుష్పక విమానం అని మేం చెప్పలేదు. రావణుడు ఓ మాయావి. అతడు ఏ పక్షిపైనైనా లేదా జంతువుపైనైనా లేదా ఎలాంటి వాహనంపైన అయినా రావొచ్చు. టీజర్ లో ఉన్నది పుష్పక విమానం కాదు. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమౌతుంది.”
చిన్నప్పుడు దూరదర్శన్ లోని రామాయణంలో చూసిన రావణుడిలా, ఇప్పటి రావణుడు కూడా కనిపించాలంటే ఎలా అని ప్రశ్నించాడు ఓం రౌత్. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని, రావణుడ్ని మరింత క్రూరంగా చూపించే ప్రయత్నం చేశామే తప్ప, పురాణాల్ని కించపరిచే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు.
“దూరదర్శన్ లో వచ్చిన రామాయణంలో అప్పటి టెక్నాలజీ, అందుబాటులో ఉన్న విజ్ఞానం ప్రకారం రావణుడ్ని దుష్టుడిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది. నేటి తరం పిల్లలకు దుష్టుడు అంటే చాలా విజువల్స్ వాళ్ల మైండ్ లో మెదులుతాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రావణుడ్ని దుష్టుడిగా చూపించాలి. మేం అదే చేశాం. పైగా టీజర్ లో చూపించినట్టుగా, సినిమా మొత్తం రావణుడు అలానే ఉంటాడని మేం చెప్పడం లేదు కదా. సినిమా చూడండి, ఆ తర్వాత విమర్శించండి.”
విమర్శలు చేసేముందు తన ట్రాక్ రికార్డ్ ను ఓసారి గమనించాలని కోరుతున్నాడు ఓం రౌత్. తను సంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తానో, హిందూ ధర్మాన్ని ఎంతలా పాటిస్తానో అందరికీ తెలుసని, కాబట్టి ఆదిపురుష్ పై ఎలాంటి విమర్శలు చేయొద్దని కోరుతున్నాడు.