హీరో సిద్ధార్థ్ గురించి, వ్యక్తిగత జీవితంలో ప్రేమకు సంబంధించిన విషయాలు తప్ప వేరే ఏ టాపిక్ గురించి అడిగినా సరే ప్రశ్నలు వేసినా సమాధానాలు చెబుతా అంటుంది హీరోయిన్ అదితి రావు హైదరి. ఓటీటీ చానెల్ జీ5లో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ .. ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’. ఈ సిరీస్‌ను కాంటిలో పిక్చర్స్ రూపొందించింది.
ఇందులో స్టార్ హీరోయిన్ అదితిరావు హైదరి ప్రధాన పాత్రలో నటించారు. ధర్మేంద్ర, నసీరుద్దీన్ షా, రాహుల్ బోస్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అభిమన్యు సింగ్ – రూపా సింగ్ ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మించారు. రాన్ స్కాల్‌పెల్లో, అజయ్ సింగ్, విబు పూరి ఈ షోను డైరెక్ట్ చేశారు.
ఈ సిరీస్ గురించి అదితిరావు హైదరి మాట్లాడుతూ .. “అనార్కలి పాత్ర నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చేయగలనా? అని ఆలోచించాను. అయితే దర్శకులు నాపై నమ్మకం ఉంచినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ సమయంలో నేను చేయనని చెబితే వారు ఒప్పుకునేలా లేరు కూడా. ‘మొఘల్ ఈ ఆజామ్’ (హిందీ సినిమా)కి భిన్నమైన కోణంలో ఈ కథ నడుస్తుందని వారు చెప్పారు.
ఈ పాత్ర అందరూ అనుకున్నంత సులభమైతే కాదు. ఓ నటిగా దర్శకుడు ఏం అనుకుంటున్నారో దాన్ని మనం ప్రెజెంట్ చేయగలగాలి. అప్పుడే ప్రజల హృదయాల్లో చాలా రోజుల పాటు గుర్తుండిపోతాం. నేను నా పనిని ప్రేమిస్తున్నాను. అందుకనే నా పాత్రలలో నేను పూర్తిగా లగ్నమైపోతాను. ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’ సిరీస్‌లో నేను చేసిన అనార్కలి పాత్ర నాకు పూర్తిగా ఛాలెంజింగ్‌గా ఆనిపించింది. ఎందుకంటే అదొక చారిత్రాత్మక పాత్ర.
జీ 5లోని తాజ్ డివైడెడ్ బై బ్లడ్‌లో చూపించిన అనార్కాలి పాత్ర.. అమాయకంగా ఉంటుంది .. అలాగే నిర్భయంగాను కనిపిస్తుంది. మరో వైపు మానవతను చూపిస్తుంది. ఆ పాత్రను సరికొత్తగా చిత్రీకరించిన విధానం నచ్చింది. నా దృష్టిలో ప్రేమను మించి శక్తివంతమైన అంశం ఇంకోటి ఉండదు. అనార్కలి పాత్రలో నటించడం వల్ల నేను ప్రత్యేకంగా అర్థం చేసుకున్నది అదే.
నాకు తెలుగు, తమిళ్ బాగా అర్థమవుతుంది .. మలయాళం అర్థం కాదు. హిందీ బాగా మాట్లాడుతాను .. ఉర్దూ కూడా మేనేజ్ చేయగలను. నటిగా ఇంకా చాలా చేయాలని అనుకుంటాను. మణిరత్నంగారితోనూ, సంజయ్ లీలా భన్సాలీతోనూ రిపీటెడ్‌గా పనిచేసే అవకాశాలు రావడం నా అదృష్టం. నాలో ఇంకా ప్రతిభ ఉందని ఎవరైనా భావిస్తే ఆనందంగా ప్రాజెక్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ రేఖగారి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే అదొక గొప్ప అవకాశంగా భావిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.