– పేర్లు మార్చి బురిడీ
– అనుమతులపై అధికారుల దాగుడుమూతలు
– పేరు గొప్ప ఊరు దిబ్బలా వ్యవహారం
– ఫ్లాట్స్ అందక ఇబ్బందుల్లో 1200 మంది
– థర్డ్ పార్టీకి ఇవ్వడంలోనూ చీటింగ్!
– ఆఖరికి.. నిజాలు రాస్తే మీడియాపై చిందులు
క్రైంబ్యూరో, తొలివెలుగు:లక్షలు పోసి కొనుగోలు చేసిన ఫ్లాట్స్. అమ్ముకోవాలనుకుంటే కుదరదు. అధికారులను మభ్యపెట్టి, కోర్టు తీర్పులు ఉన్నాయంటూ అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్స్ చేస్తారు. అదే ఫ్లాట్ ని అమ్ముకోవాలంటే సవాలక్ష తిప్పలు పడాలి. చివరకు నోటరీయే గతి. ఇలా ఇప్పటికే గోకుల్ ఫ్లాట్స్ లో ఈ తంతు కొనసాగుతోంది. తోట చంద్రశేఖర్ కనుసన్నల్లో నడుస్తున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్ లో కొనుగోలు చేసిన వారి పరిస్థితి కూడా ఇంతే. 2016లో డబ్బులు వసూలు చేస్తే.. ఇప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. టైటిల్ క్లియర్ లేని ఈ ఫ్లాట్స్ పై ఎలా ఫైట్ చేయాలో అర్థం కావడం లేదు వాటి ఓనర్స్ కి.
డబ్బుల పేరుతో అరాచకం
ఫ్లాట్ బుక్ చేసుకునే ముందు డబ్బులు ఎలా ఇవ్వాలో రాయించుకుంటారు. ఆ ప్రకారంగా ఇవ్వకపోతే.. నెల నెలకు 3 రూపాయల వడ్డీ ఇవ్వాలంటారు. వడ్డీకి మళ్లీ వడ్డీ వేసి ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువ రాబడతారు. లేకపోతే, ఫ్లాట్ ఇవ్వమని బెదిరిస్తారని కస్టమర్స్ వాపోతున్నారు. బౌన్సర్స్ ని పెట్టిమరీ దమ్కీ ఇస్తుంటారని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పమంటే.. మొదట నెల, 6 నెలలు అంటూ చెప్పి.. తీరా సమయం పూర్తి కాగానే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారని అంటున్నారు. వివాదాస్పద భూమి కావడంతో ఏ అధికారి వద్దకు వెళ్లినా ఎందుకు కొనుగోలు చేశారని ఎదురు ప్రశ్నించే వారే తప్ప.. చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

కోర్టులను తప్పుదారి పట్టించి.. తెచ్చుకున్న తీర్పులతో అధికారులను మేనేజ్ చేసి జీహెచ్ఎంసీ నుంచి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ హఫీజ్ పేట్ లో అనుమతులు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే సుప్రీం స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ, హైకోర్టులో మరో తీర్పు తెచ్చుకున్నారు. పాయిగా భూముల్లో వచ్చే తీర్పులన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రోజుకో తీర్పుతో 60 ఏండ్లుగా ఎటూ తేలడం లేదు. జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు 2020 వరకు ముగిశాయి. మళ్లీ రెన్యువల్ కి అప్లై చేసుకున్నా.. అధికారులు ఇచ్చే ధైర్యం చేయడం లేదు. ఒకవైపు ఫ్లాట్ ఓనర్స్ ని మోసం చేయడాన్ని చూస్తూ.. టైటిల్ వివాదం ఉండటంతో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కానీ, అక్రమంగా జరుగుతున్న కన్ స్ట్రక్షన్ ని మాత్రం ఆపలేకపోతున్నారు. 2016కి ఇప్పటి అనుమతుల్లోనూ, చట్టాల్లోనూ మార్పులు వచ్చాయి. రెరా యాక్ట్ వర్తిస్తుంది. కొత్త మున్సిపల్ చట్టం అమల్లో ఉంది. అన్ని అనుమతులు ఉన్నా మళ్లీ అమ్ముకునేందుకు వీలు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాగుడు మూతల వ్యవహారంలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు దగాకు గురవుతున్నారు.
థర్డ్ పార్టీల పేరుతో మోసాలు
నిర్మించే స్థోమత లేకపోడంతో థర్డ్ పార్టీకి అమ్మేస్తున్నారు. నిర్మాణం, అమ్మకం, కమీషన్ బేసిక్ పై ఈ తంతు కొనసాగుతోంది. వాళ్ళు ఆదిత్య పేరు ఎక్కడా లేకుండా కొత్త కొత్త పేర్లతో క్యాపిటల్ హైట్స్, పార్చున్ హైట్స్ అంటూ చెప్పుకుని అమ్మేస్తున్నారు. అయితే.. నిర్మాణంలో అయిన ఖర్చులు బిల్స్ రూపంలో ఇస్తామని చెప్పిన ఆదిత్య.. పనులు చేయించుకుని ముఖం చాటేస్తోందని తెలుస్తోంది. సివిల్ వివాదం కావడంతో నోటీసులు, ప్రతి నోటీసులు కొనసాగుతున్నాయి. ఈమధ్య కాలంలో తోట చంద్రశేఖర్ ప్రవర్తనలో మార్పు రావడం.. బౌన్సర్స్ తో బెదిరింపులకు పాల్పడడంతో కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతున్నారట థర్డ్ పార్టీ వ్యక్తులు.
వాస్తవాలను జీర్ణించుకోలేక.. అక్కసు!
ఆదిత్య అక్రమాలపై తొలివెలుగు క్రైంబ్యూరో ఆధారాలతో సహా రెండు కథనాలు ఇచ్చింది. మొదట లైట్ తీసుకున్నారు. కానీ, కనిపించిన వారంతా అడుగుతుండడంతో.. తొలివెలుగుకు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. రోజుకు ఎంతోమంది అక్రమార్కుల చిట్టాను బయటపెడుతున్న తొలివెలుగు క్రైంబ్యూరో అదే రేంజ్ లో ఎటాక్ చేసింది. దీంతో కాళ్ల బేరానికి వచ్చే ప్రయత్నం చేశారు. తోట చంద్రశేఖర్ కి ఆదిత్యతో సంబంధం లేదంట. జీహెచ్ఎంసీ అనుమతులు రెన్యువల్ చేశామని చెప్పారు. అయితే.. చంద్రశేఖర్ ఇన్వాల్వ్ మెంట్స్ ఎలా ఉంటాయో ఆధారాలతో సహా ఇచ్చాం. జీహెచ్ఎంసీ దర్యాప్తుపై చెప్పడంతో చేసిన తప్పులు ఏంటో తెలుసుకుంటున్నారు. అసలు, 1200 మంది ఫ్లాట్ ఓనర్స్ కి ఎప్పుడు న్యాయం చేస్తారో చెప్పకుండా వార్తలు రాసే వారిపై కొపం, పగ పెంచుకుంటే ఏం ప్రయోజనం.