కుర్చీ వేసుకుని కుర్చుంటా.. పోడు భూములకు పట్టాలిస్తా.. సీఎం కేసీఆర్ అప్పుడెప్పుడో ఇచ్చిన హామీ ఇది. ఏళ్లు గడుస్తున్నాయే గానీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ క్రమంలోనే ఆదివాసీలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే.. కొందరిపై అక్రమకేసులు పెట్టి జైలుకు పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి కోయపోషగూడకు చెందిన 12 మంది ఆదివాసీ మహిళలు బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా అక్రమంగా తమను అరెస్ట్ చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్రమ కేసులు పెట్టిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తమకు భూమే ఆధారమని, పోడు భూములకు పట్టాలని ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఆదివాసీలు. వీరంతా పోడు భూముల కేసులో అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన ఆదివాసి మహిళలకు స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. గత నెలలో ఈ 12మంది జైలుకెళ్లారు.
2002 నుంచి తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని.. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టాలిచ్చి ఆదుకోవాలని కోయపోషగూడ మహిళలు విజ్ఞప్తి చేశారు.