ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది మేజర్ సినిమా. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అవార్డ్ అందుకున్నాడు అడివి శేష్. అది కూడా ఆస్కార్ కంటే పెద్ద అవార్డ్ అంటున్నాడు. ఇంతకీ అదేంటో ఆయన మాటల్లోనే..
“ముంబైలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు సినిమా చూపించాం. అందులో ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ సందీప్. అక్కడ 312 కుటుంబాలు సినిమా చూశారు. కానీ అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సినిమా చూస్తున్నంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. ఎలాంటి రియాక్షన్ లేదు. దాంతో మాకు అనేక అనుమానాలు వచ్చాయి. ఆరోజు రాత్రి 11.30 గంటలకు హెడ్ క్వార్టర్స్‌కు రమ్మని మాకు ఫోన్ వచ్చింది. మేకింగ్ ఏదైనా తప్పుచేశామోననే భయంతో వెళ్ళాం. కానీ మా టీమ్ కు వారు ఓ మెడల్ బహూకరించారు. నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ అది. అక్కడ సందీప్ విగ్రహం కూడా వుంది. ఈ మెడల్ అందుకోవడం ఆస్కార్ కన్నా గొప్ప విషయం.”
ఇలా నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ అందుకున్న విషయాన్ని బయటపెట్టాడు అడివి శేష్. వైజాగ్ లో జరిగిన మేజర్ ప్రీమియర్ సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. మెడల్ ను కూడా మీడియాకు చూపించాడు. తమ శ్రమకు గుర్తింపు దక్కిందని, మా సినిమా సక్సెస్ కు ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకోటి లేదని అన్నాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ నటించిన మేజర్ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, ఓ కీలక పాత్రలో శోభిత ధూలిపాళ్ల నటించింది.