దేశ ఆర్ధిక రంగాన్ని కుదిపివేస్తున్న అదానీ-హిండెన్ బెర్గ్ వ్యవహారం.. పార్లమెంట్ ఉభయసభల్లోనూ అట్టుడుకుతోంది. ఇండియాలోని అనేక ఆర్ధిక సంస్థలు, కోట్లాది భారతీయుల ఆదాయంపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్న ఈ సమస్యపై తక్షణమే చర్చ చేబట్టాలని విపక్షాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు, లోక్ సభలో నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మాన నోటీసులిస్తూ.. రూల్ 267 కింద వెంటనే ఉభయ సభలు దీనిపై చర్చ చేబట్టాలని డిమాండ్ చేశారు.
ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకే ముప్పు తెచ్చేదిగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. సభలో దీనికన్నా చర్చించవలసిన సమస్య మరొకటి లేదని వారు పేర్కొన్నారు. హిండెన్ బెర్గ్ నివేదికతోబాటు అదానీ గ్రూపు వ్యవహారాలపై సభ్యులు చర్చించవలసిన అవసరం ఉందన్నారు.
ఆప్ తరఫున ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, ఇంకా సీపీఐ, సీపీఎం తదితర విపక్ష నేతలు వాయిదా తీర్మాన నోటీసులిచ్చారు. వీరి ఆందోళనతో .. ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి.
అంతకు ముందే విపక్ష నేతలంతా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్ లో సమావేశమై.. ఈ అంశం మీద పార్లమెంటును స్ట్మభింపజేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయంలో తమదంతా ఒకటే వాణి అని బీఆర్ఎస్ నేత కేకే .. ఆ తరువాత స్పష్టం చేశారు.