ఏపీని, తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 9 తొమ్మిదేళ్లయిపోతోంది. మరో ఏడాదిలో విభజన చట్టం అమలు గడువు కూడా ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. బుధ, గురు వారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లను మాత్రమే వాదనలకు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల ప్రత్యేకమైన నిబంధన తీసుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా బుధవారం విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం వాయిదా వేసింది.
అయితే ఈ కేసుపై విచారణ ఎప్పుడు చేపడతారో తేదీని ప్రకటించాలని ఉండవల్లి తరపు లాయర్ అల్లంకి రమేష్ విజ్ఞప్తి చేశారు. న్యాయవాది అల్లంకి రమేష్ విజ్ఞప్తితో పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం వెల్లడించింది.