ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెరువులోని ప్రాంతీయ మనస్తత్వం కలిగిన కప్ప అంటూ జగన్ పై ఆయన మండిపడ్డారు. అద్నాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే…
ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ క్రమంలో ఆర్ఆర్‌ఆర్ మూవీ టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ లో తెలిపారు.
సీఎం జగన్ చేసిన ట్వీట్ పై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను చెరువులోని కప్పతో పోల్చారు. ప్రాంతీయ మనస్తత్వం కల చెరువులోని కప్ప కేవలం చెరువును మాత్రమే చూస్తుందని, సముద్రాన్ని చూడలేదని మండిపడ్డారు. ప్రాంతీయ విభజనలను సృష్టిస్తున్నందుకు, దేశానికి దక్కిన గౌరవాన్ని అందుకోలేకపోతున్నందుకు సిగ్గుపడు.. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో అద్నాన్ సమీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాతృభాషతో అనుబంధం కలిగి ఉండటం కమ్యూనికేషన్ ఆలోచనల్లో ప్రాథమిక ధోరణి అని అన్నారు. తెలుగును ఈ దేశానికి చెందిన భాషగా గుర్తించలేకపోతే ఈ దేశం గురించి మీరు చాలా నేర్చుకోవాలని మరికొందరు ట్వీట్ చేశారు.