న్యాయం కోసం పోరాడాల్సిన న్యాయవాదే.. భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. పవిత్రమైన న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చాడు. తన తల్లి, సోదరుడి మాటలు విని ఏకంగా 11 సంవత్సరాల పాటు తాళి కట్టిన భార్యను ఇంట్లో బంధించి.. మానసికంగా ఆమెను వేధించాడు.
జీవిత భాగస్వామి అన్న కనికరం కూడా లేకుండా నాలుగు గోడల మధ్యే బంధించి బయటి ప్రపంచానికి ఆమెను దూరం చేశాడు. దీంతో చీకటి గదిలోనే మగ్గిపోయిన ఆ అభాగ్యురాలు బక్క చిక్కిన శరీరంతో 11 సంవత్సరాల పాటు నరకాన్ని అనుభవించింది.
ఇక వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ వివాహం విజయనగరం పట్టణం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తో పాటు తన తమ్ముడు మాటలు విని శాడిస్ట్ గా తయారయ్యాడు.
కట్టుకున్న భార్యను బయటి ప్రపంచానికి దూరం చేస్తూ చీకటి గదిలోనే 11 ఏళ్ళ పాటు బంధించాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు అడిగినా.. న్యాయవాది తన వృత్తిని అడ్డం పెట్టుకొని భార్య కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక వారు నరకయాతన అనుభవించారు.
ఇక సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటవ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్ళగా.. ‘మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా..’ అని పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు.
దాన్ని తీసుకొని బుధవారం పోలీసులు న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో చీకటి గదిలో.. దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని 1 పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరావు తెలిపారు. ఇక న్యాయం కోసం పోరాటం చేయడమే వృత్తిగా ఎంచుకున్న మధుసూదన్ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం స్థానికంగా సంచలనమైంది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం మధుసూదన్ ను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.