మొయినాబాద్ ఫామ్ హౌస్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ చేపట్టింది. శనివారం సిట్ విచారణకు న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్ హాజరయ్యారు. నిందితుడు నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ విచారించనున్నట్లు సమాచారం. సోమవారం మరోసారి నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఈ కేసులో కరీంనగర్ లాయర్ శ్రీనివాస్ ను ఏ7గా సిట్ అధికారులు చేర్చిన విషయం విదితమే. అయితే విచారణకు హాజరైతే.. ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో శ్రీనివాస్ గైర్హాజరయినట్లు తెలుస్తోంది.
కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్‌లో సత్సంబంధాలు కలిగి ఉన్నట్టు కీలక ఆధారాలు లభించడంతో.. ప్రతాప్ గౌడ్‌ను సిట్ అధికారులు విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. ఇక ఫాంహౌస్ ఎమ్మెల్యేల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ.. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్ర లేఖ సిట్ ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు, వేర్వేరు గదుల్లో ఇద్దరినీ 8 గంటలకు పైగా విచారించారు. అయితే వీరిద్దరి నుంచి సిట్ అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్ కు మధ్య పలు ఫోన్ సందేశాలు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డులను గుర్తించిన పోలీసులు.. వాటిపై ప్రతాప్ ను ప్రశ్నించినట్లు తెలిసింది.
తొలుత తాను ఎవరితోనూ సంభాషించ లేదని, మెసేజ్ లు చేయలేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా.. జవాబు చెప్పకుండా దాట వేశారు. సాయంత్రం మరోసారి ప్రతాప్ ను విచారించినా లాభం లేకపోయింది. దీంతో శనివారం కూడా విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు.
అలాగే నందు భార్య చిత్ర లేఖను విచారించిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లో ఆమెకు, ప్రతాప్ గౌడ్, నందుకు మధ్య పలు కాల్స్, వాట్సాప్ సందేశాలు బయట పడ్డాయి. ఆయా మేసేజ్ లలో ఏ సమాచారం ఉందని, ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నందుకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి.. వారు ఎవరు? ఎందుకు వచ్చారు? అని ఆమెను ప్రశ్నించారు అధికారులు.
దీనికి ఆమె సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్ గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురంచి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ.. ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవడంతో.. ఉద్దేశ పూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తిరిగి విచారణకు హాజరు కావాల్సిందిగా చిత్రలేఖను సిట్ అధికారులు ఆదేశించారు. మొత్తానికి విచారణ వేగవంతం కావడంతో రోజు రోజుకు మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఇక విచారణ నిమిత్తం 41ఏ నోటీసుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్టే తెచ్చుకోవడంతో తదుపరి ఏం చేయాలన్న దానిపై సిట్ అధికారులు కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.