హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య జరిగి ఏడాది అయింది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని మంథని కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో వారి చిత్రపటానికి న్యాయవాదులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కోర్టు విధులను బహిష్కరించారు.
ఇటు వామనరావు తండ్రి కిషన్ రావు మాట్లాడుతూ.. ఇది చేతకాని ప్రభుత్వమని మండిపడ్డారు. హైకోర్టు న్యాయవాదులను చంపేస్తే ఇంతవరకు అసలు సూత్రధారులను శిక్షించలేదని.. ఇక సామాన్య ప్రజలకు ఎలా రక్షణ దొరుకుతుందని ప్రశ్నించారు. హత్య చేయించిన నిందితులు ప్రభుత్వంలో దర్జాగా పదవులు అనుభవిస్తూ నియోజకవర్గంలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ తిరుగుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీలో ఉంటే ఎంత నేరం చేసినా శిక్షలు ఉండవా అని ప్రశ్నించారు.
కొడుక్కి తల కొరివిపెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఏ తండ్రికి రావొద్దని.. తనకు టీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి కల్పించిందన్నారు కిషన్ రావు. ఇంతటి మనోవేదనకు కారణం అయిన అసలు హంతకులను టీఆర్ఎస్ ప్రభుత్వం శిక్షిస్తుందని అనుకున్నానని.. కానీ ఏడాది అయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న పుట్ట మధు బినామీలు కుంట శ్రీను, బిట్టు శ్రీను అత్యంత విలాసవంతమైన ఇంటి నిర్మాణాల పనులు ఎలా శరవేగంగా జరుగుతున్నాయని ప్రశ్నించారు.
అసలు నిందితులను సీఎం నేటికీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగిస్తుంటే న్యాయం జరుగుతుందా అని తనను బంధువులు అడుగుతున్నారని అన్నారు కిషన్ రావు. తన జన్మదినం రోజున ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కేసీఆర్ శిక్షిస్తారని ఏడాదిగా అందరికీ చెబుతున్నానని వాపోయారు. వామనరావు దంపతుల అసలు నిందితులను శిక్షించాలని… పుట్టిన రోజున కేసీఆర్ కు చేతులు జోడించి వేడుకున్నారు.
మరోవైపు స్థానిక ప్రజలు వామనరావు దంపతులకు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి.. అసలు నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.