సినిమాల్లో హీరోలు చేసే అద్భుత విన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘సాహో ‘లో ప్రభాస్, ‘పఠాన్’ చిత్రంలో షారుఖ్ ఖాన్ ..ఇంకా కొన్ని హాలీవుడ్ మూవీల్లో హీరోలు ఆకాశంలో రివ్వుమని ఎగురుతూ విలన్లను రఫ్ఫాడించడం చూస్తుంటాం. కానీ అది రీల్ అయితే ఇలాంటి సీన్లను రియల్ లైఫ్ లో కూడా చూడబోతున్నాం.. అయితే ఇలా పక్షుల్లా గాల్లో ఎగరడానికి జెట్ ప్యాక్ సూట్లు అవసరం.. బెంగుళూరు లోని యలహంక ఎయిర్ బేస్ లో నిర్వహించిన ఏరో ఇండియా షో లో ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన జెట్ ప్యాక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సాయుధ దళాలకోసం రూపొందించిన ఈ జెట్ ప్యాక్ సూట్ ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు.. బెంగూరులోని అబ్సొల్యూట్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తయారు చేసిన ఈ సూట్ మూడు కిలోల బరువు ఉంటుంది. టర్బో ఇంజన్ తో సహా అయిదు ఇంజన్లు ఉన్న ఈ జెట్ ప్యాక్ సూట్ ధరించిన వ్యక్తి 10 నిముషాల్లో 10 కి.మీ. దూరం వెళ్లగలడట .. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, కొండ చరియలు విరిగి పడడం, ఇంకా ఇలాంటి ఉత్పాతాల్లో సైనిక ఆపరేషన్లకు, సహాయక చర్యలకు ఈ విధమైన సూట్లు ఎంతో ఉపయోగపడుతాయని ఈ సంస్థ ఎండీ రాఘవరెడ్డి తెలిపారు.
తాము దీని తయారీలో 70 శాతం స్వదేశీ పరికరాలను వాడామని, పూర్తిగా దేశీయంగా తయారు చేసేందుకు మరికొంత కాలం పడుతుందని ఆయన చెప్పారు. ఈ సూట్ సైనికుడిని 10 నుంచి 15 మీటర్ల ఎత్తువరకు ఎగరడానికి, గంటకు సుమారు 50 కి.మీ. దూరం ప్రయాణించడానికి తోడ్పడుతుందని అన్నారు.
దీని వెనుక డీసెల్ ట్యాంక్ ఎలెక్ట్రానిక్స్ సాధనాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సాయుధ దళాలలో దీన్ని ప్రవేశ పెట్టాలని ప్రస్తుతానికి తాము భావించడం లేదని, అయితే ఆర్మీ నుంచి ఓ అభ్యర్థన వచ్చిందని రాఘవరెడ్డి చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో దీనికి సంబంధించిన డిమాన్స్ట్రేషన్లు ఉంటాయన్నారు. అయితే దీన్ని టెస్ట్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రయల్ బేసిస్ పై తమకు 48 జెట్ సూట్లు కావాలని ఆర్మీ ప్రతిపాదించింది. మార్చి నెలలో సైనికులు కొందరు వీటిని పరీక్షించనున్నారు.