తూర్పు ఆఫ్గనిస్తాన్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 1000 మంది మరణించినట్లు ఆ దేశ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ మంత్రి మల్వాయ్ షర్ఫుద్దీన్ తెలిపారు. మరో 600 మంది గాయపడ్డట్టు చెప్పారు. పాక్టికా ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బఖ్తర్ వార్తా సంస్థ మృతుల సంఖ్యను నివేదించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలిక్టాప్టర్ ద్వారా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. భూకంప తీవ్రతకు 90 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.చాలామంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
పాక్టికా ప్రావిన్స్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉంది.దీంతో పాక్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. “తీవ్రమైన భూకంపం పాక్టికా ప్రావిన్స్ లోని నాలుగు జిల్లాలను కదిలించింది.వందలాది మంది మరణించారు, గాయపడ్డారు. చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి” అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్ లో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ఆ ప్రాంతానికి బృందాలను పంపామని తెలిపారు.
మరోవైపు పొరుగున ఉన్న ఖోస్ట్ ప్రావిన్స్ లోని ఒక జిల్లాలో భూకంపం వల్ల 25 మంది మరణించారు. 95 మందికి పైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరుగుతోందని తాలిబన్ లీడర్ అఖుంజాదా కూడా ప్రకటించారు.