తాలిబన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ తమ వశమైందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాబూల్ లోని రష్యన్ ఎంబసీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా డబ్బుతో దేశం విడిచివెళ్లారని తెలిపింది. డబ్బును నింపేందుకు ప్లేస్ సరిపోక.. కొంత అక్కడే పడేసి వెళ్లినట్లు ప్రకటించింది.
తాలిబన్లు కాబూల్ లోకి ఎంటర్ కావడంతోనే ఘనీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్తపాతాన్ని తగ్గించేందుకు తాను కాబూల్ ను వదిలి వెళ్లానని తర్వాత ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఘనీ భారీగా నగదుతో దేశాన్ని వీడారని రష్యా రాయబార సంస్థ కామెంట్స్ చేయడంపై ఆ దేశం వ్యూహంగా కనిపిస్తోంది. తాలిబన్లతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకే రష్యా ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు విశ్లేషకులు.
అదీగాక.. కాబూల్ లో తమ దౌత్య కార్యాలయాలు కొనసాగుతాయని ప్రకటించింది రష్యా. తాలిబన్లను ఆప్ఘాన్ పాలకులుగా గుర్తించే విషయంలో తొందరపడబోమని చెబుతూనే.. అన్నీ నిశితంగా గమనిస్తామని.. తాలిబన్లతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటామని ప్రకటించింది.