ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను కూడా తాలిబాన్లు చుట్టుముట్టడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి అన్నిదారులు మూసుకుపోయాయి. అధికారం కాపాడుకునే అవకాశాలు ఒక్కటీ లేకపోవడంతో తప్పించుకోవడమే అయనకు మార్గమైంది. దీంతో అధ్యక్ష పదవికి రాజీమానా చేసి ఘనీ.. ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలివెళ్లినట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఘనీ తనకు సన్నిహితులైన నేతలు, అధికారుల బృందంతో కలిపి ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన తజకిస్థాన్‌లో తలదాచుకున్నట్టుగా చెబుతున్నారు. తాలిబాన్లను ఎదుర్కొనడంలో ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు పూర్తిగా విఫలం అయ్యాయి. అధికారం అప్పగించడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేకుండాపోయింది. అయితే కాబూల్‌లో ఎలాంటి హింసకు పాల్పడబోమని, శాంతియుతంగానే అధికారాన్ని కోరుకుంటున్నట్టు తాలిబాన్ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అధ్యక్ష భవనంలో ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తయినట్టుగా తెలిసింది.