రాక్షస చర్యలకు మారుపేరుగా చెప్పుకునే తాలిబాన్లు..ఊహించని విధంగా శాంతి మంత్రం జపించారు. ఆప్ఘాన్ పౌరుల పట్ల తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వంలో వచ్చి చేరాలని మహిళలను సైతం ఆహ్వానించారు. తాలిబాన్ల చేతికి చిక్కొద్దని ఆఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి వెళ్తున్న వేళ.. తాలిబాన్ల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దేశ ప్రజలు గతంలోలానే పనులు చేసుకోవాలని పిలుపునిచ్చిన తాలిబాన్లు… ప్రభుత్వ అధికారులు విధుల్లో చేరాలని సూచించారు. యధావిధిగా కార్యకలాపాలను కొనసాగించాలని ఆదేశించారు. అయితే వారి ప్రకటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పటికే కాబూల్‌ను హస్తగతం చేసుకున్న వారు… ఇంతవరకూ ఎటువంటి దుశ్చర్యలకూ పాల్పడినట్టుగా వార్తలేవీ రాలేదు. రాజధాని నగరంలోని వీధుల్లో ప్రస్తుతం తాలిబాన్లు గస్తీ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. దీంతో వారు ఎక్కడ ఇళ్లపైపడి దోచుకుంటారోనన్న భయంతో.. ప్రజలెవరూ బయటకు రావడం లేదు.
దేశ ప్రజలను క్షమిస్తున్నట్టు తాలిబాన్లు ప్రకటన చేసినప్పటికీ చాలా మంది వారి మాటలను నమ్మడం లేదు. గతంలో నడిరోడ్డుమీదే అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడిన చరిత్ర ఉన్న తాలిబాన్ల నోట.. ఇప్పుడు శాంతి వచనాలు రావడం సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి సహకరించిన వారి జాబితా తాలిబాన్ల దగ్గర ఉందని… కచ్చితంగా వారిని ఏదో ఒకటి చేస్తారని అందరూ అంచనా వేస్తున్నారు.
తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు ఎనాముల్లా సమంగాని.. క్షమాభిక్ష గురించి మీడియాతో మాట్లాడారు. కానీ ఆయన అతని వ్యాఖ్యలు అస్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అక్కడ పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరగలేదు. “ఇస్లామిక్ ఎమిరేట్ మహిళలు బాధితులు కావాలని మేం కోరుకోవడం లేదు.. షరియా చట్టం ప్రకారం వారు కూడా ప్రభుత్వ నిర్మాణంలో ఉండాలి” అని అనుకుంటున్నట్టుగా ఎనాముల్లా చెప్పారు.
గతంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు, మహిళలు ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో ఆయన మాటలని విశ్వసించడం కష్టమేననన్న అభిప్రాయాలు అక్కడి వారిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ” రెండు దశాబ్దాలుగా ఆప్ఘాన్‌లో సాధించుకున్న మానవ హక్కులు, అభివృద్ధి అలాగే కొనసాగితే అదే పదివేలు అని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల చెబుతున్నాయి.