బండ్లు ఓడలు… ఓడలు బండ్లు అవుతాయనే సామెతను మనం తరుచూ వింటూ ఉంటాం. ఆ సామెత ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేందకు సరిగ్గా సరిపోతుంది.
గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజభోగాలను అనుభవించాడు. కాన్వాయ్ లో ముందో కారు.. వెనకో కారు… వెనక పదిమంది అధికారులు, అప్పటి ఆ పరిస్థితులే వేరు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ డీసీలో ఊబర్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన వార్తను ఓ ఆంగ్లపత్రిక ప్రచురించింది.
ఒకప్పుడు కోట్ల రూపాయలతో బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆయన.. నేడు ఆయన తన బడ్జెట్ చూసుకుని ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ పలువురు వాపోతున్నారు.
కాబూల్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకునే వారం రోజుల ముందు ఆయన తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సంబంధాలు దెబ్బతినడంతో రాజీనామా చేసి అమెరికా వెళ్లిపోయారు.