దేశంలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ఒక్క సారిగా కలకలం మొదలైంది.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని సెపాహిజాలా జిల్లా దేవీపూర్ లో జంతువనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫామ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ను అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు అలెర్ట్ అయ్యారు.
ఇప్పటి వరకు ఫామ్ లో సుమారు 60కి పైగా పందులు మరణించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అగర్తలా వ్యాధుల పరీక్ష కేంద్రం నుంచి నిపుణులను జిల్లా అధికారులు పంపించారు. జంతువుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు అధికారులు పంపించారు.
ఈ ఫలితాలు ఏప్రిల్ 13న వచ్చాయి. ఇందులో జంతువులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. భోపాల్ లోని ల్యాబ్ నుంచి మరొక రిపోర్టు రావాల్సి వుందని అధికారులు తెలిపారు. వ్యాధిని నియంత్రించేందుకు పందులను పెద్ద ఎత్తున వధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.