తనతో సహజీవనం చేసిన శ్రధ్ధా వాకర్ ని దారుణంగా హతమార్చి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా.. తీహార్ జైల్లో తనకు చదువుకోవడానికి నవలలు, పుస్తకాలు కావాలని కోరాడు. ఇందుకు జైలు అధికారులు అంగీకరించారు. త్వరలో ఇతనికి వీటిని ఇస్తామని వారు చెప్పారు.
జైల్లో ఇతని సెల్ వద్ద సెక్యూరిటీని పెంచినట్టు వారు తెలిపారు. అఫ్తాబ్ కి నార్కో టెస్ట్ నిర్వహించిన అనంతరం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు సభ్యుల బృందం నిన్న ఈ జైలుకు చేరుకొని ఈ టెస్ట్ అనంతర ఇంటర్వ్యూ కోసం ఇతడ్ని సంప్రదించినట్టు జైలు వర్గాలు తెలిపాయి.
శ్రధ్ధా మొబైల్ ఫోన్ లోని కీలక సమాచారాన్ని కొందరికి ఇతగాడు షేర్ చేశాడని, అలాగే ఆమె శరీరాన్ని ముక్కలుగా కోయడానికి తాను వాడిన ఆయుధాల సమాచారం కూడా తెలిపాడని వెల్లడయింది. నార్కో టెస్టులో పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు ఈ విషయాలు చెప్పాడట.
ఇతర ఖైదీలతో కాకుండా ఇతడిని వేరుగా గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక సెల్ లో ఉంచారు. అక్కడ 24 గంటలూ ఇతనిపై నిఘాకు గార్డులను కూడా నియమించారు. శ్రధ్ధాను కిరాతకంగా చంపినందుకు అఫ్తాబ్ లో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని జైలు వర్గాలు తెలిపాయి.