చాలా కాలం తరువాత గాంధీ భవన్ లో ఓ దృశ్యం చూడ్డానికి కనిపించింది. అంతర్గత కలహాలు, వర్గ పోరుతో వెలవెలబోతున్న గాంధీ భవన్ లో ఈ దృశ్యంతో కల సంతరించుకుంది. వ్యక్తిగత గొడవలు, ఈగోలను పక్కన పెట్టిన టీ కాంగ్రెస్ శ్రేణులంతా ఒకే వేదికపై కనిపించారు.
దీనికి కారణం రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడడం. దీన్ని నిరసిస్తూ గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులంతా ఒక రోజు దీక్షకు దిగాయి. వర్గాలు, గ్రూపులు,సీనియర్లు, జూనియర్లన్న తేడాలన్నింటి పక్కన పెట్టి ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక కాంగ్రెస్ కురువృద్దుడు డీఎస్ గాంధీ భవన్ రాకతో మరింత ఆసక్తి నెలకొంది. తొలుత పెద్ద కొడుకు సంజయ్ తో కలిసి డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని డీఎస్ ఖండించారు. తన కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడని, తాను మాత్రం బీఆర్ ఎస్ లోనే కొనసాగుతానని ఓ లేఖ విడుదల చేశారు. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరు కాంగ్రెస్ లో మరొకరు బీజేపీలో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు.
అయితే గాంధీభవన్ కు వీల్ చైర్ పై సహాయకుడి సాయంతో వచ్చిన డీఎస్.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. తన పేరుతో విడుదలైన లేఖతో తనకు సంబంధంలేదని తేల్చిచెప్పారు. గాంధీభవన్ లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ లు నల్లా చొక్కాలు వేసుకొని ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్టాడుతూ.. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అనేది బీజేపీ పథకం ప్రకారం ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిధ్ధంగా ఉన్నామన్న ఆయన అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామా చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీలో ఆ దిశగా చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని చెప్పారు.