కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేబట్టిన ‘భారత్ జోడో పాద యాత్ర’ పూర్తి అయిన అనంతరం జనవరి 26 నుంచి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ ను పార్టీ చేపట్టనుంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ఎంపీ కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారంలో మూడు రోజులపాటు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ప్లీనరీని నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.
‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ రెండు నెలలపాటు కొనసాగుతుందని, భారత్ జోడో యాత్రలో మాదిరే ఇందులోనూ ప్రజలతో మమేకం కావాలన్నదే దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండాలని రాహుల్ గాంధీ ఎందుకు నిర్ణయించారన్న ప్రశ్నకు ఆయన.. భారత్ జోడో పాద యాత్ర ఇంకా కొనసాగుతోందని, ఈ కారణంగా రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేరని వేణుగోపాల్ చెప్పారు.
ఈ స్టీరింగ్ కమిటీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ భాఘేల్, సీనియర్ నేతలు పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోని తదితరులు హాజరయ్యారు. వర్కింగ్ కమిటీ స్థానే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం.
పార్టీ కొత్త చీఫ్ గా ఖర్గే బాధ్యతలు చేబట్టిన తరువాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన రాజ్యసభలో విపక్ష నేతగా కూడా కొనసాగుతారని పార్టీవర్గాలు తెలిపాయి, ఇప్పటివరకు దీనిపై పలువురు సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో దీనిపై స్పష్టత వచ్చినట్టు భావిస్తున్నారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న సూత్రాన్ని లోగడ రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. అయితే ఖర్గే విషయంలో దీన్ని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది.