అనంతపురం జిల్లా ప్రజలను వరదలు వీడినా కూడా.. బురద కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఎటు చూసినా బురదతో వీధులన్నీ నిండిపోయాయి. దీంతో బాధితులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాపై మూడు రోజులుగా పగ పట్టిన వరద శాంతించింది. శుక్రవారం వరకు కాలనీలకు కాలనీలను ముంచేసిన వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రాంత బాధితులు తిరిగి ఇంటికి వచ్చే సరికి ధ్వంసమైన ఇళ్లు, పాడైపోయిన సామాన్లు, బురదతో నిండిన కాలనీలు స్వాగతమిచ్చాయి.
ఇళ్లల్లో ఉన్న బురదను, మురుగునీటిని అతి కష్టం మీద తోడుకుంటున్నారు ప్రజలు. ఇళ్లల్లో భాగా బురద పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు, దుస్తులతో సహా మొత్తం తడిచిపోయాయి. దీంతో దుర్వాసన, దోమలు, పురుగులతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు రోడ్లపై ఉన్న బురదను మున్సిపల్ అధికారులు శుభ్రం చేస్తున్నా కూడా.. ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను వదిలించుకునేందుకు జనం నానా కష్టాలు పడుతున్నారు.
వరదల కారణంగా ఇళ్లలోని నిత్యవసరాలు తడిచి ముద్దయ్యాయి. కనీసం వండుకునేందుకు, తినేందుకు కూడా వీల్లేకుండా పోయింది. దీంతో అటు మున్సిపల్ అధికారులు, స్వచ్చంద సంస్థ ఆర్డీటీ సిబ్బంది ప్రజలకు ఆహారం, నీరు అందిస్తున్నారు. వరదతో చాలా నష్టపోయామని.. బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రెండు రోజులుగా తాము నీటిలోనే బిక్కు బిక్కుమంటూ గడిపామని బాధితులు వాపోతున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 18 కాలనీలు నీటమునిగాయంటే సిట్యువేషన్ ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చు.
నిత్యం కరువు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికించాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అయ్యింది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పంట పొలాలు నీట మునగడంతో జనం అల్లాడిపోయారు.