భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సిడ్నీలో ఆస్ట్రేలియాతో తాజాగా జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ ముందు 195 పరుగుల లక్ష్యం ఉండగా శిఖర్ ధావన్, కోహ్లిలు దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే భారత ఇన్నింగ్స్‌లో చివర్లో 15 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో పాండ్యా ఉన్నాడు. ఇంకే ముందీ.. బౌండరీలు బాదుతూ పరుగులు పిండుకున్నాడు. చివర్లో రెండు సిక్సర్లు కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు.
కాగా భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ డానియెల్ శామ్స్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా పాండ్యా సిక్సర్లు కొట్టి భారత్ విజయానికి ఫినిషింట్ టచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో పాండ్యా 22 బంతుల్లోనే 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అయితే పాండ్యాకు టీ20 మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం ఏమోగానీ అతను గతంలో.. 2011లో అదే అవార్డును ఒక టోర్నీలో అందుకున్న సందర్భంగా తీసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అందులో పాండ్యా ఎలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఇక తాజాగా జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాక పాండ్యా మాట్లాడుతూ.. తాను ఉపయోగించే రెగ్యులర్ బ్యాట్ పగిలిపోయిందని, కనుక ఏ బ్యాట్‌తో ఆడాలో తనకు సరిగ్గా అర్థం కావడం లేదని తెలిపాడు. అయినప్పటికీ మ్యాచ్‌లో సంతృప్తికర ఇన్నింగ్స్ ఆడానని అన్నాడు.