ఆరాటం పెళ్ళికొడుకు పేరంటాలిని ఎత్తుకుపోయాడని సామెత.! పెళ్ళికి ముందు కాబోయే భార్యని చూడాలనుకోవడం..ఆమెతో మాట్లాడి అభిప్రాయాలు పంచుకోవాలనుకోవడం కుర్రకారు సహజ లక్షణం. అమ్మాయిలకు అలాంటి ఉద్దేశం ఉన్నా బయట పడకుండా మ్యానేజ్ చేసి పెళ్ళితంతు పూర్తయ్యేదాకా హుందాగా వ్యవహరిస్తారు.
ఆడవాళ్ళకు ఇది ఉగ్గుపాలతో నేర్చుకున్న వ్యవహారం. నిజానికి పెళ్ళికి ఒకటి రెండు సార్లు మాటామంతీ అంటే ఎవరూ అడ్డు చెప్పరు..ఈ రోజుల్లో అది పెద్ద విషయం కూడా కాదు. అయితే పెళ్ళిజరుగుతున్న సమయంలో ఆ తంతు సాంతం పూర్తికాకుండానే మాటిమాటికి అమ్మాయి గదికి వెళ్ళిన ఆత్రం పెళ్ళికొడుకు నిర్వాకం అతని పెళ్ళికే ఎసరుపెట్టింది. భెళ్ళున అవ్వాల్సిన పెళ్ళి ఛళ్ళుమనే చెంపదెబ్బతో పెటాకులయ్యింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒక జంటకు పెళ్లి నిశ్చయమైంది. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. వధువరులిద్దరూ పెళ్లి దండలు మార్చుకున్నారు. మిగతా పెళ్లి ఆచారాలు జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె పట్ల పెళ్లికుమారుడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు.
కాగా, ఇది చూసిన వరుడి తండ్రి అలా చేయవద్దని చెప్పాడు. అయినప్పటికీ పెళ్లికుమారుడు లెక్క చేయలేదు. వధువు గదిలోకి పదేపదే వెళ్లసాగాడు. దీంతో ఆగ్రహం పట్టలేని తండ్రి అందరి ముందు కుమారుడి చెంపపై కొట్టాడు. అయితే వరుడు కూడా తిరిగి పెళ్ళికుమార్తె తండ్రి చెంపపై కొట్టాడు. ఇది చూసిన బంధువులు, వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో వరుడితో తాళి కట్టించుకునేందుకు వధువు నిరాకరించింది. అతడితో పెళ్లిని రద్దు చేయాలని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లిని రద్దు చేయాలని వధువరుల కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో వరుడి కుటుంబం, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.