ముగిసిన విచారణ. ఇప్పుడు కార్మికులకు దిక్కెవరు...? - Tolivelugu

ముగిసిన విచారణ. ఇప్పుడు కార్మికులకు దిక్కెవరు…?

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు విచారణ ముగియటంతో కార్మికులకు ఇప్పుడు దిక్కెవరు అనే చర్చ మొదలైంది. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నా… కోర్టు మొట్టికాయలు వేస్తుంది కదా, తమకు న్యాయం జరుగుతుందని అంతా భావించారు. నాయకులు కూడా అదే ధోరణితో స్పీచ్‌లివ్వటంతో కార్మికులంతా నాయకులపైనే భారం వేసి… ప్రభుత్వం మీద యుద్ధమే చేశారు.

కానీ, కోర్టు ఇది లేబర్ కోర్టులో తేల్చుకోండని స్పష్టం చేసింది. అంతేకాదు… తిరిగి విధుల్లోకి తీసుకొమ్మని కూడా తాము చెప్పలేమని చెప్పేయటంతో… ఇప్పుడు బంతి లేబర్‌ కోర్టు, లేబర్‌ కమీషనర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 14 రోజుల్లో నిర్ణయం తీసుకొండని చెప్పినా… లేబర్‌ కోర్టు ఈ అంశాన్ని ఓ కంపెనీ అంశంలా మాత్రమే చూడనుంది. అదే జరిగితే…నష్టాల్లో ఉన్న కంపెనీపై యాజమాన్యం నిర్ణయమే తుది నిర్ణయమవుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కార్మికులకు మొండిచేయ్యే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడు కార్మికులు, సంఘాలు ఏం చేయబోతున్నాయన్నది కీలకంగా మారింది. కేంద్రం జోక్యం చేసుకొని… సమ్మె సామరస్యంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటుందా, ప్రభుత్వం కార్మికుల పట్ల కొంతైనా సానుకూలంగా వ్యవహరిస్తుందా… అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇన్నాళ్లు అండగా ఉంటామన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఎలా కార్మికుల పక్షాన ఉంటాయన్నది కూడా కీలకంగా కాబోతుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp