ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండిగానే వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. హైకోర్టు ఉదయం 10.30లకు చర్చలు ప్రారంభించాలని అల్టిమేటం ఇచ్చినప్పటికీ, కోర్టు తీర్పులో ఉన్న చిన్న చిన్న అంశాలను చూపిస్తూ… చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ ఇంతవరకు కార్మిక యూనియన్లను ఆహ్వనించలేదు.
ఇప్పటికే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీరుపై మండిపడ్డ హైకోర్టు… వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని, కార్మికులు కోరుతున్న చాలా అంశాలు ఆర్థికపరమైనవి కావని, సమ్మెపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది.
అయితే, దీన్ని కూడా ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. హైకోర్ట్ ఇచ్చిన తదుపరి విచారణ గడువుకు మరో 9 రోజుల సమయం ఉంది. అప్పటి వరకు వేచి చూద్దాం అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సముఖంగా లేరని ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి. సీఎం శుక్రవారం రాత్రి రవాణా శాఖ అధికారులను సమీక్ష కోసం పిలిపించి, తర్వాత వెనక్కి పంపించారని పలు వార్త కథనాలు కూడా వస్తున్నాయి.
ఇటు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు కనపడుతోంది. ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం, సీఎంవో నుండి ఎలాంటి సమాచారం రాకపోవటంతో చర్చల ప్రక్రియను మొదలుపెట్టలేదు.
అయితే, కోర్టు ధిక్కరణ కింద యూనియన్ నేతలు మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం కనపడుతోంది. దీనిపై కోర్టు ఎవిధంగా స్పందిస్తుందో చూడాలి.