ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో కొత్త కొత్త రోబోలు పుట్టుకొస్తూ మనుషులకే సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి పనిలోనూ రోబోట్లను ఏర్పాటు చేసుకుంటుండడంతో ఉపాధి కోల్పోతున్నారు. వాటికి జీతం ఇవ్వాల్సిన పని లేదు. అయితే, వాటికి సైతం లేఆఫ్స్ గండం తప్పలేదంటే నమ్ముతారా? అవును అది నిజమే. వివిధ పనుల్లో నియమించుకున్న రోబోలను పనిలోంచి పీకేసింది టెక్ దిగ్గజం గూగుల్ .
ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీనియర్ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టింది. ఇప్పుడు రోబోట్లను సైతం ఉద్యోగంలోంచి తీసేసింది. ఇంతకి రోబోలను పనిలోంచి తేసేందుకు గల కారణాలేంటి? గూగుల్‌కు చెందిన పరిశోధన విభాగం ఎవ్రీ డే రోబోట్స్‌ను మూసి వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆల్ఫాబెట్ సీక్రెటివ్ ఏక్స్ మూన్‌షాట్ ల్యాబ్‌ను తెరిచిన ఏడాదికే మూసివేయడం గమనార్హం.
ఈ విభాగంలో సుమారు 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ రకాల రోబోటిక్స్ ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీసుల్లోనే కెఫ్టేరియాల్లో టేబుళ్లు తుడిచేందుకు, చెత్తను ఎత్తడానికి, డోర్లు తెరవడానికి ట్రైనింగ్ ఇచ్చిన రోబోలను షట్‌డౌన్ చేస్తున్నట్లు సమాచారం. ‘ఆల్ఫాబెట్‌లో ఎవ్రీడో రోబోట్స్ అనేది ఇకపై ప్రత్యేక ప్రాజెక్టుగా ఉండదు. గూగుల్ రీసర్చ్‌లోని ప్రస్తుత రోబోటిక్స్ ప్రాజెక్టులో ఆయా టీంలను విలీనం చేస్తున్నాం.’ అని తెలిపారు ఎవ్రీడో రోబోట్స్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ డేనిస్ గాంబావో.
ఖర్చులు తగ్గించుకోవడం కోసమే ఎవ్రీడే రోబోటిక్స్‌ను మూసివేస్తున్నట్లు చెప్పారు. వ్యయ నియంత్రణ చర్యలు వేగవంతం చేసినట్లు సంస్థ ఇటీవలే ప్రకటించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్స్ గత జనవరి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 12 వేల మందికి ఉద్వాసన పలికింది.
భారత్‌లోనూ సుమారు 450 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, తొలుత ప్రకటించిన 12 వేల ఉద్యోగ కోతల్లోనేనా లేక కొత్తగా ఉద్యోగాలను తొలగించారా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు గూగుల్ సంస్థ. మరోవైపు.. ఖర్చుల తగ్గింపు కోసం అంటూ ఉద్యోగులు ఆఫీసుల్లో డెస్కులు షేర్ చేసుకోవాలని తాజాగా ప్రకటించింది గూగుల్. హైబ్రీడ్ మోడ్‌లో ఉన్నప్పటికీ పాటించాల్సిందేనని పేర్కొంది. రోజుకో కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది గూగుల్.