కేరళలో నరబలి, నరమాంస భక్షకుల దారుణ ఉదంతం ఇంకా మరువక ముందే మరో షాకింగ్ న్యూస్ ! తాంత్రిక శక్తుల కోసం అమాయక పిల్లలను వినియోగించుకుంటున్న అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో పతనమిత్థ జిల్లాలోని మళయాళపుజ టౌన్ లో తాంత్రిక శక్తుల కోసం ఓ మహిళ పిల్లలను వినియోగించుకుంటోంది. శోభన అలియాస్ వాసంతి అనే ఈమె ఓ బాలికను తీసుకువచ్చి ఆమెపై మంత్రాలను చదువుతూ ఏవో పూజలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు.
వీటికి భయపడి ఆ బాలిక స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. శోభనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన పెద్దలు నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శనకు దిగారు. ఆమెను అరెస్టు చేసేంతవరకు తాము ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. తనను ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని శపిస్తానని శోభన బెదిరించిందని వీరు తెలిపారు. చివరకు వీరి ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
డీఎస్పీ ఆదేశాలపై శోభనను కస్టడీలోకి తీసుకున్నామని, ఆమెను విచారించిన తరువాతే ఆమె ఎలాంటి పూజలవంటివి చేస్తోందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల కోచ్చి జిల్లాలో ఇద్దరు మహిళలను భార్యాభర్తల జంట.. నరబలి పేరిట దారుణంగా హతమార్చి వారి శరీరాలను ముక్కలుగా కోసి వండి తిన్నామని పోలీసుల ఇంటరాగేషన్ లో చెప్పారు. ఈ కేసులో వీరి ఏజెంటును కూడా ఖాకీలు అరెస్టు చేశారు. మహమ్మద్ షఫీ అనే ఈ ఏజెంటు 2020 లో 75 ఏళ్ళ మహిళపై అత్యాచారం చేశాడని, ఆమె ప్రైవేటు భాగాల్లో కూడా గాయాలు చేసి చంపబోయాడని పోలీసులు చెప్పారు.